Operation Sindoor: భారత సైన్యం బుధవారం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయ్యింది. పాకిస్తాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. ఈ దాడిలో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. బుధవారం తెల్లవారుజామున బహవల్‌పూర్‌లోని జైష్-ఎ- మొహమ్మద్ స్థావరం, మురిడ్కేలోని లష్కరే-ఎ-తోయిబా స్థావరంతో సహా తొమ్మిది ఉగ్రవాద లక్ష్‌యాలపై భారత సైన్యం క్షిపణి దాడులు నిర్వహించింది. భారత ఆర్మీ దాడిలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ చనిపోయినట్లు సమాచారం. మసూద్ ఫ్యామిలీలోని 14 మంది హతమయ్యారు. కాగా తాను చనిపోలేదంటూ మసూద్ పేరుతో ఉర్దూలో లేఖ విడులైంది. తనకు భయం లేదని, తనను చంపేస్తే బాగుండేదని, వదిలేసి తప్పు చేశారని ఆ లేఖలో పేర్కొన్నాడు. కాగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఇంత కచ్చితత్వంతో ఉగ్రవాదుల స్థావరాలను ఎలా ధ్వంసం చేసిందనేదానిపై ప్రస్తతం చర్చ కొనసాగుతోంది. పాక్ పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా కేవలం ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడిని విజయవంతంగా పూర్తి చేయడం వెనుక ఉన్న హస్తమేంటనే ప్రశ్న తలెత్తుతోంది. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిందెవరు? అనే సందేహం కలుగక మానదు. అయితే పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను భారత్ ఎలా ట్రాక్ చేసిందన్న సందేహం ప్రస్తుతం అందరి మదిని తొలుస్తోంది. జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ (NTRO) ఇందుకు సహకరించింది. ఉగ్రస్థావరాలను గుర్తించి నిఘా సమాచారాన్ని అందించింది. 2004లో NTROను స్థాపించారు. ఇది జాతీయ భద్రతా సలహాదారు, ప్రధానమంత్రి కార్యాలయానికి అనుసంధానంగా పనిచేస్తుంది. అధునాతన సాంకేతిక నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకోవడం, దేశ భద్రతను కాపాడడంలో ఇది కీలక భూమిక పోషిస్తోంది. ఉగ్రవాద ముప్పు, సైబర్ దాడులు, సరిహద్దు రక్షణకు సంబంధించి NTRO అత్యంత కీలకంగా వ్యహరిస్తుంది. అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను సమకూర్చుకోవడం ద్వారా ఉగ్రవాదులను ట్రాక్ చేయడంలో ముఖ్యపాత్ర పోషించింది.