Hailstorms: నిన్న కురిసిన వడగళ్ల వానకు రాలిన మామిడి తోటలను మంగళవారం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల అధ్యక్షులు కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి ఓగులాపూర్ గ్రామంలో పరిశీలించారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ చిగురుమామిడి మండలంలో నిన్న రాత్రి కురిసిన వడగళ్ల వర్షాలతో దెబ్బతిన్న వరి పంటలను, మామిడి ఇతర పండ్ల తోటలను వెంటనే వ్యవసాయ అధికారులు పరిశీలించి అంచనాలు వేసి రైతులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిగురుమామిడి మండలంలో చాలా గ్రామాల వద్ద ఐకేపీ సెంటర్ల వద్ద వరి ధాన్యం వందలాది క్వింటాల అమ్మకం కోసం ఆరబోసారని వడగళ్ల వాన వల్ల పూర్తిగా తడిసి ముద్దయ్యాయని అన్నారు. వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. రైతన్న చేతికి అందిన పంట వడగళ్ల వాళ్ళతో నీటిలో కలిసిపోయిందని, మామిడి ఇతర పళ్ళ తోటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని రైతన్న తీవ్ర ఆవేదనతో కృంగిపోతున్నాడని వెంటనే ప్రభుత్వం ప్రతి ఎకరాకు 50 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పంట బీమా పథకాన్ని అమలు చేసి ఉంటే రైతులకు ఎంతో ఉపయోగపడేదని ప్రభుత్వ అసమర్థ విధానం వల్ల ప్రతి రైతు కూడా పరిహారాన్ని గ్యారంటీగా అందుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని లేకుంటే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని జైపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పండ్లతోటలు పరిశీలించిన వారిలో పతెం రాజేశ్వర్ రెడ్డి, తాటి పెళ్లి లింగయ్య,బోయిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.