Lose the assembly elections and contest for Parliament
Lose the assembly elections and contest for Parliament

Lose the assembly elections and contest for Parliament: అక్కడ ఓడి.. ఇక్కడ పోటీ..

  • అసెంబ్లీ ఎన్నికల్లో కీలక నేతల ఓటమి
  • ఈసారి పార్లమెంట్ గడప తొక్కేందుకు తహతహ
  • ఆయా పార్టీల నుంచి పోటీ
  • ఈ సారైనా అదృష్టం కలిసి వస్తుందా?

Lose the assembly elections and contest for Parliament: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గత ఏడాది డిసెంబర్ లో ముగిశాయి. ఆ సమయంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు పోటీ చేసి ఓటమి చవిచూశారు. వారిలో కొంత మంది మరోసారి పార్లమెంట్ ఎన్నికల పుణ్యమా అని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారంతా ఇప్పటికే క్షేత్రస్థాయిలో తమ ప్రచారాన్ని ముమ్మరం చేయగా, నువ్వానేనా? అన్నట్లు పోరులో తలపడుతున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి పలువురు కీలక నేతలు పోటీ చేశారు. పదేండ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా, ఆ పార్టీ అభ్యర్థులకు పోటీగా ప్రస్తుత ఎంపీలు, కీలక నేతలు నిలబడ్డారు. అందులో కొందరు అనూహ్యంగా ఓటమి చవిచూశారు. దీంతో వారు మళ్లీ పార్లమెంట్ గడప తొక్కేందుకు తహతహలాడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

పోటీచేసి.. ఓటమి పాలై..
గత అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు కీలక నేతలు ఓటమి పాలయ్యారు. బీజేపీ నుంచి కీలక నేతలుగా ఉన్న పలువురు ఓటమి పాలవడం గమనార్హం. బీజేపీ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఈటల రాజేందర్ (హుజూరాబాద్/ గజ్వేల్), రఘునందన్ రావు ( దుబ్బాక), నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (కోరుట్ల), బండి సంజయ్ కుమార్ (కరీంనగర్), డీకే అరుణ (గద్వాల) ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ( జగిత్యాల), బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి), బాజిరెడ్డి గోవర్ధన్ (నిజామాబాద్ రూరల్), అప్పుడు బీఎస్పీ నుంచి పోటీ చేసి ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ( సిర్పూర్) బరిలో నిలిచి తమ ప్రత్యర్థుల చేతిలో ఓటమి చవిచూశారు.

మరోసారి బరిలో కీలక నేతలు..
అసెంబ్లీ ఎన్నికలో ఓటమి చవిచూసిన పలువురు నేతలు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ దక్కించుకొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందులో మెజార్టీగా బీజేపీ నేతలే ఉండడం గమనార్హం. ఈటల రాజేందర్ (హుజూరాబాద్/ గజ్వేల్), రఘునందన్ రావు ( దుబ్బాక), నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (కోరుట్ల), బండి సంజయ్ కుమార్ (కరీంనగర్), డీకే అరుణ (గద్వాల) ఉన్నారు. వీరంతా ప్రస్తుతం ఎంపీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, మెదక్ నుంచి రఘునందన్ రావు, నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్ కుమార్, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా గెలిచి పార్లమెంట్ లో తమ గళం వినిపించాలని తహతహలాడుతున్నారు. ఈ మేరకు కదనరంగంలో తమ ప్రచారాన్ని సైతం ముమ్మరం చేశారు.

ఈ స్థానంలో ప్రత్యర్థులంతా ఓడిన వారే..
నిజామాబాద్ పార్లమెంట్ నుంచి గత అసెంబ్లీ పోటీ చేసి ఓడిన వారంతా పోటీ చేస్తుండడం గమనార్హం. కోరుట్ల అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ చేతిలో ఓటమి చవిచూశారు. ఆర్టీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రూరల్ అభ్యర్థిగా బరిలో నిలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూపతి రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ నుంచి జగిత్యాల అభ్యర్థిగా పోటీ చేసిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. వీరంతా మరోసారి నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, ఇక బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బరిలో నిలిచారు. వీరిలో అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.

గెలిచి నిలిచేనా..?
గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన వారు ఈసారైనా గెలిచి నిలుస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వారు ప్రాతినిథ్యం వహించిన స్థానాల్లో్నే ఓడిపోతే.. ఇక పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్ల నాడిని ఎలా పట్టుకుంటారని పలువురు రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆయా పార్టీలకు చెందిన నేతలు ప్రాతినిథ్యం వహిస్తారు. ఇక ఓటర్లు స్థానిక నేత, పార్టీ తదితరవి బేరీజు వేసుకొని ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఆయా పార్టీల నేతలను ఓటర్లు ఏ మేరకు ఆదరిస్తారనేది ప్రశ్నార్థకం. గత ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని అన్ని స్థానాల్లో మెజార్టీ స్థానాలు అధికార పార్టీ కైవసం చేసుకున్నా.. ఎంపీగా మాత్రం ఇతర పార్టీల అభ్యర్థులు గెలిచారు. ఈ లెక్కన ఓటర్లు ఎవరిని ఆదరిస్తారు? ఎవరికి చెక్ పెడతారన్నది జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *