KL Rahul: సన్ రైజర్స్ ఓపెనర్లు విధ్వంసం సృష్టించిన వేళ.. లక్నో బౌలర్లు నిశ్చేష్టులయ్యారు. ఎవరైనా కోపంగా కొడతారు.. లేకపోతే బలంగా కొడతారు.. వీళ్లేంట్రా చాలా శ్రద్ధగా కొడుతున్నారు.. ప్రతి బంతిని స్టాండ్‌లోకే కొట్టాలన్నంత కసిగా ఆడుతున్నారు. ఇదేం బాదుడురా బాబోయ్ అంటూ ప్రత్యర్థి టీంల బ్యాటర్లు, బౌలర్లు, కోచింగ్ స్టాఫ్ మొత్తం ‘అతడు’ సినిమా డైలాగ్‌ను గుర్తు చేసుకుంటున్నారు.
మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. ఇలాంటి విధ్వంసాన్ని క్రికెట్‌లో చూడాలంటే టీవీల్లోనే సాధ్యమయ్యేది. కానీ నా కళ్లముందే నేను చూస్తానని అనుకోలేదు. ప్రతి బంతిని బ్యాట్‌కు మిడిల్‌లో తాకించడం అంటే సాధ్యమే కాదు. అలాంటి ది హెడ్, అభిషేక్ శర్మ దాన్ని చేసి చూపించారు. మేం 240 చేసినా వాళ్లు దాన్ని అలవోకగా ఛేజ్ చేసేవారేమో అని సన్ రైజర్స్ బ్యాటర్లపై కేఎల్ రాహుల్ ప్రశంసలు కురిపించాడు.
సన్ రైజర్స్ ఓపెనర్లు ఇప్పటి వరకు రెండు సార్లు పవర్‌ప్లే లోనే 100 పరుగుల పైగా స్కోరు చేసి ఔరా అనిపించుకున్నారు. హెడ్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేస్తుంటే ప్రత్యర్థి బౌలర్లకు బాల్స్ ఎక్కడ వేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఎక్కడ వేసినా కొడుతున్నారు. ఎలాంటి బంతిని సంధించినా దాన్ని సిక్సో, ఫోరో కొడుతున్నారు. ఇదేంది ఇది ఇలా ఆడటం సాధ్యం కాదే అని చాలా మంది క్రికెట్ పండితులు చర్చించుకుంటున్నారు.
లక్నో మ్యాచ్‌లో హెడ్, అభిషేక్ విధ్వంసంతో 9.4 ఓవర్లలోనే 166 పరుగులను ఛేజ్ చేసి అందరినీ సంబ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. నువ్వు ఒకటి కొడితే.. నేను రెండు కొడతా అన్నట్లు సాగింది ఇద్దరి బ్యాటింగ్ తీరు. దీంతో కేఎల్ రాహుల్ కూడా వీరిని అభినందించకుండా ఉండలేకపోయాడు. అయితే 12 మ్యాచులు ఆడిన లక్నోకు ఇంకా రెండు మ్యాచులు ఉన్నాయి. రెండింట్లో విజయాలు సాధిస్తేనే ప్లే ఆఫ్‌కు వెళుతుంది. లేకపోతే ఇంటి బాట పట్టాల్సిందే.