- హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీ
- పంజాబ్‌పై ఎస్ఆర్‌హెచ్ గెలుపు
- హైదరాబాద్‌ను ఆదుకున్న నితీశ్
- 64 పరుగులతో రాణింపు
- చివరి బాల్ వరకు సాగిన మ్యాచ్
- 2 పరుగులతో ఎస్ఆర్‌హెచ్ విజయం
IPL 2024 SRH vs PBK: పీబీకేతో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ పైచేయి సాధించింది. చివరి బాల్ వరకు సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. పంజాబ్ బ్యాటర్లు శషాంక్ సింగ్, అశుతోష్ శర్మ చివరి వరకు పోరాడినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. చివరి ఓవర్‌లో (6, వైడ్, వైడ్, 6, 2, 2, వైడ్, 1, 6) ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టింది. చివరి బంతి వరకు సాగిన మ్యాచ్‌లో పంజాబ్ ఒక దశలో హైదరాబాద్‌ను భయపెట్టినా మొత్తానికి సైన్ రైజర్స్ మ్యాచ్ ను నిలబెట్టుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ వెనువెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 100 పరుగులకే 5 వికెట్లు పడ్డాయి. మరో వైపు నితీశ్ (64) ధాటిగా ఆడి మ్యాచ్‌పై ఆశలు సజీవంగా ఉంచాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా 23వ మ్యాచ్ ఛండీగఢ్ మల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానంలో మంగళవారం పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. 27 పరుగుల వద్ద 3.2 ఓవర్‌లో హెడ్ మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. 27 పరుగుల వద్ద రెండో వికెట్‌గా మార్క్‌క్రమ్ ఔట్ అయ్యాడు. దీంతో హైదరాబాద్ పీకల్లోతు కష్టా్ల్లో పడింది. 39 పరుగుల వద్ద మూడో వికెట్‌గా అభిషేక్ శర్మ, 64 పరుగుల వద్ద త్రిపాఠి వికెట్లు కోల్పోయింది హైదరాబాద్.
100 పరుగుల వద్ద ఐదో వికెట్‌గా క్లాసెన్ అవుట్ అయ్యాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా నితీశ్ కుమార్ రెడ్డి ధాటిగా ఆడి పరుగులు రాబట్టాడు. ఆరో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 150 పరుగుల వద్ద అబ్దుల్ సమద్ ఆరో వికెట్‌గా, 151 పరుగుల వద్ద నితీశ్ రెడ్డి ఏడో వికెట్‌గా పెవిలియన్ చేరారు. 20 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. హెడ్ 21, అభిషేక్ శర్మ 16, మార్‌క్రమ్ 0, నితీశ్ రెడ్డి 64, త్రిపాఠి 11, క్లాసెన్ 9, అబ్దుల్ సమద్ 25, షాబాద్ అహ్మద్ 3, భువనేశ్వర్ 6, జాయదేవ్ ఉనడ్కట్ 6 పరుగులు చేశారు. అర్షదీప్ 4, సామ్ కర్రమ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు.
183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ మొదటి నుంచి కష్టాలు ఎదర్కొంది. ఏ దశలోనూ మ్యాచ్‌పై ఆశలు నిలుపుకోలేకపోయింది. రెండు పరుగుల వద్దే మొదటి వికెట్‌గా జానీ బెయిర్‌స్టో వికెట్ సమర్పించుకున్నాడు. 11 పరుగుల వద్ద ప్రభ్‌షిమ్రన్ సింగ్, 20 పరుగుల వద్ద శిఖర్ ధావన్ మూడో వికెట్‌గా వెనుదిరిగారు. 58 పరుగుల వద్ద నాలుగో వికెట్‌గా సామ్ కర్రమ్ ఔట్ అయ్యాడు. సిఖందర్ రాజా, శశాంక్ సింగ్ ఇద్దరూ కలిసి మ్యాచ్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. అప్పటికే చేయాల్సిన లక్ష్యం కొండంత ఉండడంతో పోరాడినా విజయం దిశగా నడిపించలేకపోయారు.91 పరుగుల వద్ద ఐదో వికెట్‌గా సిఖందర్ రాజా వెనుదిరిగాడు. 114 పరుగుల వద్ద జితేశ్ శర్మ అవుట్ అయ్యాడు. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ 14, జానీబెయిర్ స్టో 0, ప్రభ్‌షిమ్రన్ సింగ్ 4, సామ్ కర్రమ్ 29, సిఖందర్ రాజా28, శషాంక్ సింగ్46, జితేశ్ శర్మ 19, అశుతోష్ శర్మ 33 పరుగులు చేశారు.