సూపర్ ఓవర్‌లో నెగ్గిన నమీబియా.. పోరాడి ఓడిన ఓమన్
T20 World Cup 2024: నమీబియా(Namibia), ఓమన్ (Oman) మధ్య బార్బడోస్(Barbados)లో జరిగిన మ్యాచ్ లో ఇరు జట్లు 109 పరుగులే చేయగా సూపర్ ఓవర్ కు దారి తీసింది. స్వల్ప టార్గెట్ ను ఛేదించలేకపోయిన నమీబియా సూపర్ ఓవర్ లో 21 పరుగులు చేసి ప్రత్యర్థిని 10 పరుగులకే కట్టడి చేసి గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఓమన్ 109 పరుగులకే ఆలౌట్ కాగా.. ఓమన్ ఓపెనర్లు తక్కువ స్కోరుకే అవుటయ్యారు. దీంతో మిడిలార్డర్ బ్యాటర్లు ఖలీద్ కాళీ (34), జాకీర్ మసూద్ (22) పార్ట్ నర్ షిప్ బిల్డ్ చేయగా.. తర్వాత వచ్చిన బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. దీంతో 19.4 ఓవర్లలోనే 109 పరుగులకు ఆలౌట్ అయింది.
పిచ్ కాస్త స్లో గా ఉండటం, బౌలింగ్ కు అనుకూలించడంతో ఓమన్ బౌలర్లు కూడా నమీబియా బ్యాటర్లను కట్టడి చేశారు. నమీబియా బ్యాటర్లలో జేమ్స్ ఫ్రాంక్లిన్ 45 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఫ్రాంక్లిన్ అవుట్ అయిన తర్వాత మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో సూపర్ ఓవర్ కు దారి తీసింది. ఓమన్ పేసర్ బిలాల్ చివరి ఓవర్ లో అయిదు పరుగులను కూడా కాపాడుకుని మ్యాచ్ ను టైగా ముగించాడు. బిలాల్ వేసిన చివరి బంతిని కీపర్ మిస్ చేయకుండా ఉండే ఓమన్ మ్యాచ్ గెలిచేదే. కానీ ఓమన్ వికెట్ కీపర్ ఈజీ బాల్ మిస్ చేసి రనౌట్ కొట్టలేకపోవడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది.
సూపర్ ఓవర్ లో నమీబియా సీనియర్ ఆల్ రౌండర్ డేవిడ్ వీజా రెచ్చిపోయాడు. ఫస్ట్ రెండు బంతుల్లో సిక్సు, ఫోర్ కొట్టి 10 పరుగులు చేయగా.. చివరి రెండు బంతులు కెప్టెన్ ఏరాస్మస్ రెండు ఫోర్లు బాదాడు. నమీబియా ఆరుబంతుల్లో నే 21 పరుగులు చేసి 22 పరుగుల టార్గెట్ ను ఓమన్ ముందు ఉంచింది. ఓమన్ బ్యాటర్లు కేవలం 10 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోవడంతో నమీబియా సూపర్ ఓవర్ లో నెగ్గి 2 పాయింట్లు సాధించింది.