బెంగళూరు రేవ్ పార్టీ నేపథ్యంలో
రేపు కోర్టులో హజరు పర్చనున్న సీసీబీ పోలీసులు
Actress Hema arrested: ఇటీవల బెంగళూరు నగర శివారులో జరిగిన రేవ్ పార్టీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టంచిన విషయం తెలిసిందే. పార్టీలో రాజకీయ, సినీ ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీలో పాల్గొన్న వారు డ్రగ్స్ వినియోగించారు. రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి దాదాపు వంద మందిని అరెస్టు చేశారు. ఇందులో 25 మంది వరకు యువతులే ఉన్నారు. అయితే పార్టీలో తాను పాల్గొనలేదంటూ నటి హేమ బుకాయించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కయ్యారు. రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లు వార్తలు గుప్పు మనడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఒక వీడియోను రిలీజ్ చేశారు. తాను హైదరాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నానని, బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజాం లేదంటూ కొట్టి పారేశారు. రేవ్ పార్టీలో పోలీసులకు భారీగా డ్రగ్స్, కొకైన్ లభించాయి.
బెంగళరూ రేవ్ పార్టీపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంచలన విషయాలు బయట పెట్టారు. ‘సన్ సెట్ – సన్ రైజ్ విక్టరీ’ పేరుతో పార్టీ నిర్వహించినట్లు వెల్లడించారు. పార్టీ అరుణ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో కొనసాగినట్లు స్పష్టమైంది. రిమాండ్ రిపోర్టులో రాజకీయ ప్రముఖులతోపాటు సినీ నటుల పేర్లు ఉన్నాయి.
అయితే రేవ్ పార్టీలో తాను లేనని హేమ అబద్ధపు వీడియో పోస్ట్ చేశారని పోలీసులు తేల్చేశారు. పార్టీలో హేమ పాల్గొన్నారని బెంగళూరు సిటీ కమిషనర్ దయానంద్ క్లారిటీ ఇచ్చారు. పార్టీలో పాల్గొనేందుకు ఒక్కొక్కరు రూ.25 లక్షలకుపైగా ఫీజు చెల్లించినట్లు తెలిసింది. కాగా హేమ విడుదల చేసిన వీడియో ఫేక్ అని ధృవీకరించారు. వీడియో ఎక్కడి నుంచి తీశారనేదానిపై ఎంక్వైరీ చేశారు.
బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్ టెస్ట్ నిర్వహించిన వారిలో మొత్తం 86 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మొత్తం 150 మంది రక్తనమూనాలను నార్కోటిక్ టీమ్ సేకరించింది పరీక్షలకు పంపింది. 59 మంది పురుషులు, 27 మంది మహిళలు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. కాగా ఈ కేసులో విజయవాడకు చెందిన లంకపల్లి వాసుది మెయిన్ రోల్ అని పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో అరెస్టు అయిన నటి హేమతోపాటు మరో ఎనిమిది మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరిని బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారు. అయితే విచారణ హాజరయ్యేందుకు తనకు మరికొంత గడువు ఇవ్వాలని కోరుతూ హేమ క్రైం బ్రాంచ్ పోలీసులకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేసింది. తాను వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నానని వెల్లడించింది. తాను రాలేని పరిస్థితుల్లో ఉన్నానని పేర్కొంది. ఈ నేపథ్యంలో రెండో సారి నటి హేమకు నోటీసులు జారీ చేశారు. రెండో సారి పంపిన నోటీసులకు సైతం ఆమె విచరాణకు హాజరు కాలేదు. దీంతో మూడోసారి నోటీసులు పంపారు. ఈ నోటీసులకు స్పందించిన హేమ సోమవారం బెంగళూరు సీసీబీ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఆమెను విచారించిన పోలీసులు దర్యాప్తు అనంతరం అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కోర్టులో హాజరు పర్చనున్నారు.