Rohini: వ్యక్తిగత విమర్శలు చేసిన జర్నలిస్టుపై నటి రోహిణి తీవ్రస్థాయిలో ఆగ్రహం వెలిబుచ్చారు. ఏ విషయం గురించైనా మాట్లాడేటప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలని చురకలంటించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాలో తాజాగా ఒక వీడియో పోస్ట్ చేశారు. ‘బర్త్‌డే బాయ్’ ప్రమోషన్స్‌లో భాగంగా రేవ్ పార్టీకి సంబంధించి ఒక ప్రాంక్ వీడియో చేశా. అది సోషల్ మీడియాలో అది పాపులర్ అయ్యింది. ఇది కేవలం పబ్లిసిటీ కోసమేనని, నిజమైన రేవ్ పార్టీ కాదని అందరికీ అర్థమైంది. ఆ వీడియోపై ఇటీవల ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూ నా దృష్టికి వచ్చింది. ఏదైనా సంఘటన గురించి మాట్లాడేటప్పుడు అది నిజమా? కాదా? అనేది పూర్తిగా తెలుసుకున్న తరువాతే మాట్లాడాలి. అంతేకానీ ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయకూడం సరికాదు. నేను మందుకు దూరంగా ఉంటా.
సినిమాల్లో భాగంగా కొన్ని సీన్స్‌లో అలా కనిపిస్తే బయటా అలాగే ఉంటామా? వ్యక్తిగతంగానూ నాపై కామెంట్స్ చేశారు. సర్జరీ కారణంగా నేను లావయ్యానని.. పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని అన్నారు. ఏం లావుగా ఉంటే పెళ్లి చేసుకోకూడదా? జర్నలిస్టులంటే నిజాలు ఏమిటో తెలుసుకొని ప్రజలకు సరైన సమాచారాన్ని అందించేవారు. ఏమీ తెలుసుకోకుండా వచ్చి ఇలా ఇంటర్వ్యూల్లో కూర్చొనేవాళ్లను జర్నలిస్టులు అనరు. మీరెలా సీనియర్ జర్నలిస్ట్ అయ్యారో నాకైతే అర్థం కావడం లేదు. మీకు ఏమీ పని లేకపోతే ఇంట్లో విశ్రాంతి తీసుకోండి. ఏదీ తెలుసుకోకుండా ఇలా మాట్లాడకండి. మీరు పెద్దవారైనందున ఇంత మర్యాదగా మాట్లాడుతున్నా. మీ స్థానంలో వేరే ఎవరైనా ఉండుంటే మరో రకంగా సమాధానం ఇచ్చేదాన్ని.’ అంటూ ఆమె సీరియస్ అయ్యారు. జబర్దస్త్ కామెడీ షోతో రోహిణి ఫేమ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో బిజీగా ఉన్నారు. ‘సేవ్ ది టైగర్స్’ సిరీస్ నటిగా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.