Netherlands vs South Africa Highlights, T20 World Cup 2024: సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ప్రోటీస్ టీం డేవిడ్ మిల్లర్ పోరాటంతో గట్టెక్కింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న సౌతాఫ్రికాకు అదిరిపోయే ఆరంభం లభించింది. నెదర్లాండ్స్ ఓపెనర్లు లెవిట్ మ్యాక్స్ డౌడ్ 0, 2 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరారు.
వన్ డౌన్ బ్యాట్స్ మెన్ విక్రమ్ జిత్ 12 పరుగులు చేసి ఔట్ కాగా, నెదర్లాండ్స్ టీం 48/6తో కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఎంగిల్ బ్రెత్ ఆదుకున్నాడు. ఎంగిల్ బ్రెత్ కీలకమైన 40 పరుగులు చేసి మరో వికెట్ పడకుండా అడ్డుగోడలా నిలిచాడు. చివర్లో వాన్ బీక్ 23 పరుగులు చేసి నెదర్లాండ్ స్కోరు బోర్డును 100 పరుగులు దాటించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 103/9తో ఇన్సింగ్స్‌ను ముగించింది.
104 పరుగుల టార్గెట్‌తో సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో ఇన్సింగ్స్ మొదటి బంతికే క్వింటాన్ డికాక్ ఖాతా తెరవకుండానే రనౌట్‌గా వెనుదిరగ్గా.. కెప్టెన్ మార్ క్రమ్ డకౌట్ కాగా.. ఓపెనర్ రీజా హెన్రిక్స్ 3 పరుగులు చేసి ఔట్ పెవిలియన్‌కు చేరాడు. దీంతో సౌతాఫ్రికా 3/3 వికెట్లతో పీకల్లోతూ కష్టాల్లో పడింది. హెన్రిచ్ క్లాసెన్ కూడా నాలుగు పరుగులే చేసి ఔటయ్యాడు. దీంతో సౌతాఫ్రికా 4.3 ఓవర్లలోనే 12 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో సౌతాఫ్రికాకు భారీ ఓటమి తప్పదనిపించింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్ మొదట్లో డిఫెన్స్ కే ప్రాధాన్యమిచ్చారు. అనంతరం మెల్లిగా షాట్లు ఆడుతూ.. సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోరు బోర్డును కదిలించారు. అనంతరం ట్రిస్టన్ స్టబ్స్ 77 పరుగుల టీం స్కోరు వద్ద అవుటయ్యాడు. డేవిడ్ మిల్లర్ బౌలింగ్ పిచ్‌పై నాలుగు సిక్సులు, మూడు ఫోర్లు బాది 51 బంతుల్లో 59 పరుగులు చేసి టీంను ఒంటి చేత్తో గెలిపించాడు.