T20 World Cup Team India: టీం ఇండియా 2007లో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో పొట్టి ప్రపంచ కప్ నెగ్గింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ టీ 20 వరల్డ్ కప్ గెలవలేదు. 2014లో ఫైనల్ చేరిన శ్రీలంక చేతిలో ఓడిపోయింది. 2016లో సెమీస్‌లో వెస్టిండీస్‌పై ఓడి ఇంటి బాట పట్టింది. ప్రతిసారి సెమీస్, ఫైనల్‌లో ఓడిన ఇండియా గత సారి మాత్రం కేవలం గ్రూప్ స్టేజీలోనే వెనుదిరిగింది.
దీంతో ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని భావిస్తోంది. రోహిత్ శర్మకు ఇదే చివరి టీ 20 వరల్డ్ కప్ కావొచ్చు. కాబట్టి కచ్చితంగా టీ20 వరల్డ్ కప్ సాధించాలని ఉబలాటపడుతున్నారు. బౌలింగ్‌లో ఫామ్ ఉన్న బుమ్రా, బ్యాటింగ్‌లో విరాట్ కొహ్లి పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. అమెరికా, వెస్టిండీస్‌లో మ్యాచులు జరుగుతుండటంతో భారత అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు.
వెస్టిండీస్‌లో 2007లో జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో లీగ్ స్టేజ్‌లోనే ఓడిపోయి ఇంటి బాట పట్టడంతో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. కానీ ఆ తర్వాత వెంటనే జరిగిన టీ 20 వరల్డ్ కప్‌లో సీనియర్లు పాల్గొనకున్నా జూనియర్లు కప్ కొట్టి తమ సత్తా ఎంటో చూపించారు.
ధోని, యువరాజ్, ఆర్పీ సింగ్, శ్రీశాంత్, రాబిన్ ఉతప్ప, రోహిత్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్ ఇలా ఎంతో మంది స్టార్లుగా ఎదిగారు. టీ 20 ప్రపంచ కప్ మళ్లీ 16 సంవత్సరాల తర్వాత సాధించి తమ సత్తా నిరూపించాలని కోరుకుంటున్నారు. యశస్వి జైశ్వాల్, సూర్య కుమార్ యాదవ్, రోహిత్, విరాట్‌లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండగా.. బౌలింగ్‌లో బుమ్రాతో పాటు సిరాజ్, కుల్డీప్, చాహల్, అక్షర్ పటేల్, జడేజా రాణిస్తే టీం ఇండియా టైటిట్ సాధించడం పెద్ద కష్టమేం కాదు. మరి 16 ఏండ్ల తర్వాత పొట్టి ప్రపంచకప్‌ను తిరిగి సాధిస్తారా లేదా మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.