T20 World Cup 2024: ఇంగ్లండ్(England), స్కాట్లండ్( Scotland) మధ్య భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు టీ 20 వరల్డ్ కప్‌లో ఆరో మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే రెండు సార్లు టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ విజయం సాధించింది. 2010, 2022 లో జరిగిన టీ 20 వరల్డ్ కప్‌ల్లో టైటిల్ కొట్టి ఇంగ్లీష్ టీం సత్తా చాటింది. పిల్ సాల్ట్, జోస్ బట్లర్, లివింగ్ స్టోన్, బెయిర్ స్టో, మొయిన్ అలీ, సామ్ కరన్ లాంటి స్టార్లతో టైటిల్ రేసులో ఉంది.
స్కాట్లాండ్ టీం ఇంగ్లండ్‌తో మొదటి సారి టీ 20 మ్యాచ్ ఆడనుండగా.. స్కాట్లాండ్ మొదటి వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. కానీ రెండో వార్మప్ మ్యాచ్ లో అఫ్గానిస్తాన్ చేతిలో 55 పరుగుల తేడాతో ఓడిపోయి ఒత్తిడిలో కూరుకుపోయింది. కరేబియన్ దీవుల్లో స్కాట్లాండ్ మొదటి సారి మ్యాచ్ ఆడనుంది. ఇది వారికి ప్రతికూలతగా మారుతుందని అనుకుంటున్నారు. అయితే స్కాట్లాండ్ స్పిన్ తో ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేయాలనుకుంటుంది.
లివింగ్ స్టోన్, సామ్ కరన్, పిల్ సాల్ట్, బెయిర్ స్టో లు స్పిన్ ఆడటంలో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేయడానికి స్పిన్ ను ఉపయోగించుకోవచ్చు. స్కాట్లాండ్ గత 17 మ్యాచుల్లో 10 గెలిచింది. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జోప్రా ఆర్చర్ పునరాగమనంతో ఇంగ్లండ్ బౌలింగ్ విభాగం పటిష్టంగా మారింది.
మాపై ఎలాంటి ప్రెజర్ లేదని ఈ టోర్నమెంట్ మొత్తం సాఫీగా సాగిపోతుందని ఆశిస్తున్నామని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. వరల్డ్ కప్ కు ముందు పాకిస్థాన్ తో టీ 20 సిరీస్ లో 2-0తో గెలవడం కూడా ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసానికి కారణం కాగా.. అయినా స్కాట్లాండ్ ను తక్కువ అంచనా వేయడం లేదని ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ అన్నాడు. బార్బడోస్ లోని కెన్నింగ్ టౌన్ లో ఎవరిని విజయం వరిస్తుందో ఈ సాయంత్రం తేలిపోనుంది.