T20 World Cup 2024, Rohit
T20 World Cup 2024, Rohit

T20 World Cup 2024, Rohit: రోహిత్ సునామీ.. పలు రికార్డులు బ్రేక్

అత్యధిక స్కోర్.. అత్యధిక సిక్సులు.. వేగవంతమైన అర్ధ సెంచరీ ఇంకా ఎన్నో..

T20 World Cup 2024, Rohit: భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ విశ్వరూపం చూపించాడు. ఆసిస్ బౌలర్లను తిత్తునియలను చేశాడు. డారెన్ సమ్మి నేషన్ క్రికెట్ స్టేడియంలో పరుగుల వరద పారించాడు. సిక్సులు, ఫోర్లతో రెచ్చిపోయాడు. రోహిత్ పరుగుల సునామీతో స్టేడియం హోరెత్తిపోయింది. 8 సిక్సులు, 7 ఫోర్లతో ఆసిస్ బౌలర్లను ఊచకోత కోసాడు. రోహిత్ పరుగుల ధాటి పలురు రికార్డులు బ్రేక్ అయ్యాయి. కొత్త రికార్డులు నమోదయ్యాయి.

అత్యధిక సిక్సులు

ఈ మ్యాచ్‌లో రోహిత్ మొత్తం 8 సిక్సర్లు బాదాడు. టీ20 ప్రపంచ కప్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇది వరకు ఈ రికార్డు యువరాజ్ సింగ్ (2007లో 7 సిక్సులు) పేరిట ఉంది. దీన్ని రోహిత్ అధిగమించి తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగానూ మరో రికార్డు నమోదు చేశాడు. 203 సిక్సులు బాది మొదటి స్థానంలో ఉన్నాడు. తరువాతి స్థానంలో గప్తిల్ (173) ఉన్నాడు. ఇప్పట్లో రోహిత్ రికార్డు బ్రేక్ చేయడం అసంభమవనే చెప్పాలి.

అత్యధిక పరుగులు

టీ20ల్లో రోహిత్ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మరో రికార్డు లిఖించాడు. టీ20 ల్లో 4165 పరుగులు చేసి మొదటి స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ (4145)ను దాటేసి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

వేగవంతమైన అర్ధ సెంచరీ

ఈ మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశాడు. టీ20ల్లో ఇదే రోహిత్‌కు వేగవంతమైన హాఫ్ సెంచరీ. టీ20ల్లో ఆస్ర్టేలియాపై అత్యంత వేగవంతమైన అర్ధ శతకం యువరాజ్(20), పొలార్డ్ (20)లపై పేరున ఉండగా వారిని రోహిత్ అధిగమించాడు. టీ20 వరల్డ్ కప్ 2024లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ ఇదే కావడం మరో రికార్డు.

వ్యక్తిగత అత్యధిక స్కోరు

టీ20 ప్రపంచ కప్‌లో భారత్ తరఫున రైనా 2010లో దక్షిణాఫ్రికాపై ఇదే మైదానంలో 101 పరుగులు చేశాడు. ప్రస్తుతం మ్యాచ్‌లో 92 పరుగులు చేసిన రోహిత్ రెండో స్థానంలో నిలిచాడు. మరోవైపు ఇదే మైదానంలో క్రిస్ గేల్ భారత్‌పై 98 పరుగులు చేశాడు.

ఆసిస్‌‌పై 24 పరుగుల తేడాతో భారత్ విజయం

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా 51వ మ్యాచ్ ఆస్ర్టేలియా, భారత్ మధ్య డారెన్ సమ్మి స్టేడియంలో సోమవారం జరిగింది. టాస్ గెలిచి ఆసిస్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్లు నష్టపోయి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ 92, పంత్ 15, సూర్య 31, శివం దూబే 28, హార్దిక్ పాండ్యా 27, జడెజా 9 పరుగులు చేశారు. మిచెల్ మార్స్, స్టొయినిస్ తలో రెండు వికెట్లు తీయగా, హాజిల్ వుడ్ ఒక వికెట్ పడగొట్టాడు.
206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్ 7 వికెట్లు నష్టపోయి కేవలం 181 పరుగులు మాత్రమే చేసింది. డేవిడ్ వార్నర్ 6, ట్రావిస్ హెడ్ 76, మిచెట్ మార్స్ 37, మాక్స్ వెల్ 20, స్టొయినిస్ 2, డేవిడ్ 15, మాథివ్ వేడ్ 1, కమ్మిన్స్ 11, మిచెల్ స్టార్క్ 4 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్షదీప్ 3, కుల్దీప్ 2, బుమ్రా 1, అక్షర్ 1 వికెట్ తీశారు. నిర్ణీత 20 ఓవర్లలో ఆసిస్ 181 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ 24 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్నది. ఈ మ్యాచ్‌పై విక్టరీతో భారత్ సెమీస్‌కు క్వాలిఫై అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *