- జింబాబ్వే టూర్‌కు యువ సంచలనాలు
- సారథి శుభ్‌మన్ గిల్
- అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్, తుషార్‌లకు చోటు
- సీనియర్స్‌కు రెస్ట్
- జూలై 10 నుంచి టోర్నీ
India squad for Zimbabwe series: జింబాబ్వేతో జరిగే 5 మ్యాచుల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ యువ సంచనాలను రంగంలోకి దింపుతోంది. సీనియర్లు అందరినీ పక్కన పెట్టింది. పూర్తి యువ జట్టుతో ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఐపీఎల్‌లో సత్తా చాటిన వారికి ప్రముఖంగా అవకాశం లభించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో యువ జట్టు జింబాబ్వేను ఢీ కొట్టనుంది.
జింబాబ్వేలో జరిగే టీ20 సిరీస్ కోసం భారత్ సిద్ధమవుతోంది. ఈ మేరకు సోమవారం 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ప్రకటించారు. ఈ టీమ్‌కు శుభ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నారు. వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, రాంచీ టెస్టు హీరో ధ్రువ్ జురెల్‌కు చోటు లభించింది. ఐపీఎల్ 17వ సీజన్‌లో సత్తా చాటిన యువ క్రికెటర్లు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్, తుషార్ దేశ్ పాండేలకు అవకాశం కల్పించారు. వీరు తొలిసారిగా బ్లూ జెర్సీలో మెరిసిపోనున్నారు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జూలై 6వ తేదీన తొలి మ్యాచ్ జరగనుంది. భారత్, జింబాబ్వే జట్లు తలపడనున్నాయి. జూలై 7న రెండో మ్యాచ్, జూలై 10న మూడో మ్యాచ్, జూలై 13న నాలుగో మ్యాచ్, జూలై 14న ఐదో మ్యాచ్ నిర్వహించనున్నారు. మ్యాచులు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతాయి.
ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ జరుగుతుండగా మరో వైపు బీసీసీఐ జింబాబ్వే పర్యటనకు భారత జట్టును ప్రకటించింది. ఈ పర్యటనకు సీనియర్ ప్లేయర్లు అందరినీ పక్కన పెట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పేసర్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలతోపాటు సూర్యకుమార్ యాదవ్‌లకు రెస్ట్ ఇచ్చారు. కాగా ఇప్పటి వరకు భారత్‌కు ప్రధాన కోచ్‌ను డిక్లేర్ చేయలేదు. గౌతం గంభీర్‌ను హెడ్ కోచ్‌గా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్ జింబాబ్వే పర్యటనకు వెళ్లే జట్టుకు కోచ్‌గా వ్యవహరించే అవకాశముంది.