- పోచారం పార్టీ మార్పుపై కేసీఆర్ స్పందన
- ఎమ్మెల్యేలతో లంచ్ మీటింగ్
KCR lunch meeting with MLAs: మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారడంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఆయన పార్టీ మారడంతో పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదని, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదని అన్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌తో పలువురు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీలు శురి సుభాష్ రెడ్డి, దండె విఠల్ రెడ్డిలతోపాటు మాజీ ఎమ్మెల్యేలు జోగ రామన్న, నాయకులు క్యామ మల్లేశ్ రావుల శ్రీధర్ రెడ్డిలతో కలిసి కేసీఆర్ లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు.
పార్టీ ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఎవరూ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఇలాంటి పరిణామాలు వైఎస్ హయాంలోనూ చూశామని, ఇలాంటి వాటికి భయపడే స్పసక్తే లేదని స్పష్టం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన వచ్చిన నష్టం ఏమీ లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వరుస భేటీలు ఉంటాయని వెల్లడించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. అలాగే లా అండ్ ఆర్డర్ పరిస్థితి అధ్వానంగా మారిందని ఆరోపించారు. భవిష్యత్తులో మనకు మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.