National Consumer Day: నిర్మల్, డిసెంబర్ 24 (మన బలగం): వినియోగదారుల హక్కులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఆయన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి వినియోగదారునికి హక్కులు, చట్టాలు, న్యాయపరమైన వివరాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. వినియోగదారుడు కొన్న ప్రతి వస్తువుకు రశీదును పొందడం తప్పనిసరి అని అన్నారు. వస్తువుకు క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ముఖ్యమేనన్నారు. ప్రజలు వస్తు సేవలను పొందునప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని, వస్తు సేవల నాణ్యత లోపాలపై ప్రశ్నించే తత్వం అలవరుచుకోవాలని తెలిపారు. వ్యాపారస్తులంతా వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కిరణ్ కుమార్, రేషన్ డీలర్లు, వ్యాపారస్తులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.