- గత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఏమైంది?
- ఆ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదు?
- బీఆర్ఎస్‌తో చీకటి ఒప్పందమే కారణమా?
- ఆనాటి సర్వేలో కుల గణన సహా అన్ని వివరాలను సేకరించిన విషయం మర్చిపోయారా?
- స్థానిక సంస్థల ఎన్నికలను జాప్యం చేసేందుకు సర్వే పేరుతో డ్రామాలు
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
alai balai: మనబలగం, తెలంగాణ బ్యూరో: కుల గణన సర్వే పేరుతో కాంగ్రెస్ పార్టీ టైంపాస్ రాజకీయాలు చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలను జాప్యం చేసేందుకే ఈ డ్రామాలాడుతోందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరుతో కులం సహా అన్ని వివరాలు సేకరించిందన్నారు. ఆ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని మండిపడ్డారు. సమగ్ర కుటుంబ సర్వే ఉండగా, మళ్లీ కుల గణన పేరుతో ఈ డ్రామాలెందుకని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల అమలు, రుణమాఫీ విషయంలో ప్రజలంతా కాంగ్రెస్‌పై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఘోరంగా ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ కుల గణన పేరుతో టైం పాస్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి విచ్చేసిన బండి సంజయ్ అనంతరం మీడియాతో మాట్లాడారు.
‘కుల గణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన దుర్మార్గమైనది. చిత్తశుద్ధితో చేయడం లేదు. స్థానిక సంస్థలను ఆలస్యంగా నిర్వహిండానికి, తప్పించుకునే ధోరణిలో వ్యవహరిస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో కుల గణన సహా అన్ని వివరాలను పొందుపర్చారు. ఆనాడు వేరే దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రజలను సైతం రప్పించి నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఏమైంది? అసలు అందులో ఏముంది? బీఆర్ఎస్ ఎలాగూ ఆ నివేదికను బయటపెట్టలేదు? కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఎందుకు బయటపెట్డం లేదు? కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు మధ్యనున్న చీకటి ఒప్పందమేమిటి? ఆ చీకటి ఒప్పందంలో భాగంగానే ఆ నివేదికను బయటపెట్టడం లేదా? అసలు ఎస్కేఎస్ నివేదికలో ఉన్న లోపాలేంది? ఆ సర్వేతో ఒనగూరిన ప్రయోజనం ఏంది?
ఆ నివేదిక ఉండగా మళ్లీ కుల గణన సర్వే పేరుతో రూ.150 కోట్ల నిధులు కేటాయించి 60 రోజుల గడువు పెట్టడమెందుకు? ఎస్కేఎస్ నివేదిక నాటికి, నేటికీ తెలంగాణ ప్రజల కులం ఏమైనా మారిందా? మరి దేని కోసం ఈ డ్రామాలాడుతున్నరు? కాంగ్రెస్ నేతల తీరును చూస్తుంటే కుల గణన ఓ ఫేక్ అన్పిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామని ఆ పార్టీ నేతలకు భయం పట్టుకుంది. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆరు గ్యారంటీలపై ప్రజలు నిలదీస్తున్నారని తెలిసి కుల గణన పేరుతో టైం పాస్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను బయట పెట్టాలి’ అని అన్నారు.
అంతకు ముందు ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో బండి సంజయ్ ఏమన్నారంటే… ‘దత్తాత్రేయ పేరు వినగానే హోలి, అలయ్ బలయ్ కార్యక్రమాలు గుర్తుకొస్తాయి. హోలి పండుగనాడు దత్తాత్రేయ హోలి ఆడితే 3 నెలలపాటు రంగు పోదు. ‘అలయ్ బలయ్’ పేరుతో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు హాజరై తెలంగాణ సంస్క్రుతి, సంప్రదాయాలను గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉంది. రాబోయే తరాలు మన తెలంగాణ సంస్కృతి, హిందూ సంస్కృతి మర్చిపోకుండా అలయ్ బలయ్ నిర్వహించడం గొప్ప విషయం. ఈ కార్యక్రమానికి హాజరుకావడం చాలా ఆనందంగా ఉంది. అందరం కలిసిమెలిసి ఉంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ శక్తిమంతమైన సమాజ నిర్మాణం కోసం చేస్తున్న కృషిలో భాగస్వాములు కావాలని కోరుతున్నా.’ అని అన్నారు.
గంగం రాంరెడ్డికి నివాళి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం మధ్యాహ్నం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూర్ గ్రామానికి విచ్చేశారు. ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టు గంగం మహేశ్ రెడ్డి తండ్రి గంగం రాంరెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగం రాంరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. బండి సంజయ్ వస్తున్నారని తెలిసి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు, బీజేపీ కార్యకర్తలందరికీ అభివాదం చేస్తూ వారితో సెల్ఫీలు దిగారు.