17 నుంచి హైదరాబాద్ మల్లేపల్లి డాక్టర్ ఈశ్వర చంద్ర హాస్పిటల్‌లో
Plastic surgery: మనబలగం, తెలంగాణ బ్యూరో: సేవా భారతి, లయన్స్ క్లబ్ గ్రీన్ ల్యాండ్స్, మెర్సీ మిషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి 30 వరకు హైదరాబాద్‌లోని మల్లేపల్లి సీతారాంబాగ్ ప్రాంతంలోని డాక్టర్ ఈశ్వర్ చంద్ర ఆసుపత్రిలో ఉచిత మెగా ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్ నిర్వహించునున్నారు. ప్లాస్టిక్ సర్జరీ అత్యంత ఖరీదైన ఆపరేషన్‌గా మారిన ఈ రోజుల్లో నయాపైసా తీసుకోకుండా లక్షల రూపాయల విలువైన ఆపరేషన్లను ఉచితంగా చేయడంతోపాటు రోగులకు అవసరమైన మందులను సైతం ఉచితంగా అందించేందుకు నిర్వాహకులు ముందుకు రావడం చాలా గొప్ప విషయమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సేవాభారతి, లయన్స్ క్లబ్ గ్రీన్ ల్యాండ్, మెర్సీ మిషన్స్ ప్రతినిధులను, ఉచితంగా సర్జరీ చేసేందుకు ముందుకొచ్చిన వైద్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
డాక్టర్ ఆర్.సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో అమెరికాలోని డాక్టర్ల ప్రతినిధి బృందం ఇప్పటికే అభివృద్ది చెందిన అనేక దేశాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ పెద్ద సంఖ్యలో ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారన్నారు. అందులో భాగంగా హైదరాబాద్ ఓల్డ్ సీతారాంబాగ్‌లోని సేవాభారతి ఎల్ సీహెచ్ గ్రీన్ ల్యాండ్స్ వద్దనున్న డాక్టర్ ఈశ్వర్ చంద్ర ఆసుపత్రిలో నిర్వహించే ఉచిత మెగా ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్‌లో పాల్గొని సేవలు పొందాలని కోరారు. ఈ మెగా క్యాంప్‌లో పాల్గొనాలనుకునే వారు 9848241640, 9908630301 మొబైల్ నంబర్లకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఫోన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాలి. తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈనెల 17, 18 తేదీల్లో ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన అనంతరం అవసరమైన వారికి ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీ చేయడంతోపాటు ఉచితంగా మందులను కూడా పంపిణీ చేస్తారు.