పాల్గొన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
Vijayadashami Celebrations Khanapur 2025: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో విజయదశమి ఉత్సవాలు గురువారం రాత్రి నేత్రపర్వంగా కొనసాగాయి. శరన్నవత్రుల అనంతరం నిర్వహించే రావణ దహనం కార్యక్రమం వేలాది మంది మధ్య కన్నుల పండువగా జరిగింది. రాంలీలా మైదానంలో (ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో) హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా స్టేజీ ఏర్పాటు చేసి, సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించి, ఆట, పాటలతో అలరించారు. మహాలక్ష్మి ఆలయం నుంచి హిందు ఉత్సవ సమితి అధ్యక్షులు మంత్రారాజ్యం సురేశ్ ఆధ్వర్యంలో దుర్గమాత అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాంలీలా మైదానం వరకు డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి, దసరా వేడుకల శుభాకాంక్షలు చెప్పుకున్నారు. వేల మంది ప్రజలు తిలకిస్తుండగా రావణసుర దహనం చేసి, టపాకాయలు కాల్చారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, అనాదిగా వస్తున్న పండుగను గొప్పగా నిర్వహించడం అభినందనీయం అని, యువత చెడును వదిలి మంచి మార్గంలో ముందుకు వెళ్లాలని అన్నారు. ఇందూర్ విభాగ్ ప్రచారక్ శివకుమార్జీ మాట్లాడుతూ, హిందూ ధర్మం సనాతన మైనదని, ధర్మం రక్షణ కోసం పాటుపడాలని, స్వామి వివేకానంద ఆదర్శనీయం అని, అందరు సుఖసంతోషాలతో జీవించేదే భారతదేశం ఒక్కటే అని, ప్రపంచ దేశాలకు ఆదర్శం అని పేర్కొన్నారు. హిందు ఉత్సవ సమితి అధ్యక్షులు సురేశ్ మాట్లాడుతూ, దసరా నవరాత్రులు మాదిరిగానే, వినాయక నవరాత్రులు నిర్వహించుకుంటే బాగుంటుందని, మద్యానికి దూరంగా ఉండాలని, భక్తి శ్రద్ధలతో పండుగలు నిర్వహించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అల్లాడి వెంకటేశ్వర్లు, శెట్టి శ్యామ్మోహన్ రావ్, కరిపే శ్రీనివాస్, గౌరీకర్ రాజు, చింతామణి శ్రీనివాస కృష్ణ, కావాలి సంతోష్, లక్ష్మణ్, రాజేశ్వర్, ప్రవీణ్, నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, ఆత్మ చైర్మన్ తోట సత్యం పాల్గొన్నారు. సీఐ అజయ్, ఎస్ఐ రాహుల్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు.