Group-III Examinations: నిర్మల్, నవంబర్ 15 (మన బలగం): గ్రూప్-III పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో టీజీపీఎస్సీ గ్రూప్-III పరీక్షలను నిర్వహించబోవు సిబ్బందికి శిక్షణను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 17, 18 తేదీల్లో (ఆది, సోమవారాల్లో) జరగబోవు గ్రూప్-III పరీక్షలను ఎటువంటి లోటు పాట్లు లేకుండా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్క ఇన్విజిలేటర్, ఇతర అధికారులు నిర్దేశించిన సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. పరీక్ష కేంద్రం వద్ద భద్రత విధులు నిర్వహించబోవు సిబ్బంది ప్రతి ఒక్క అభ్యర్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే పరీక్ష కేంద్రంలోనికి అనుమతించాలన్నారు. అభ్యర్థి గుర్తింపు కార్డులోని ఫొటోతో సహా ఇతర వివరాలను సరిచూసిన తర్వాతనే అభ్యర్థిని పరీక్ష కేంద్రంలోనికి అనుమతించాలన్నారు. పరీక్ష రాయబోవు అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు.
పరీక్ష సమయంలో అభ్యర్థులకు ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తినట్టయితే ప్రథమ చికిత్స నిర్వహించడానికి వీలుగా అత్యవసర మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ప్రశ్నాపత్రాలు పరీక్ష కేంద్రాల్లోనికి తరలించే సమయంలో, పరీక్ష పూర్తయిన తర్వాత ఓఎంఆర్ పత్రాలు తరలించే సమయంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 24 పరీక్ష కేంద్రాల్లో 8124 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మాత్రమే అభ్యర్థులను పరీక్ష కేంద్రాలలోనికి అనుమతించాలని తెలిపారు. నిమిషం నిబంధన అమలులో ఉన్నందున 9.30 నిమిషాల తర్వాత ఏ ఒక్క అభ్యర్థిని పరీక్ష కేంద్రంలోనికి అనుమతించకూడదన్నారు. పరీక్ష నిర్వహణకు మొత్తం జిల్లాలో 24 మంది ముఖ్య పర్యవేక్షకులు, 26 మంది పరిశీలకులు, 24 మంది శాఖాధికారులు, 10 మంది ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 338 మంది బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు, 63 మంది ఐడెంటిఫికేషన్ అధికారులను నియమించామన్నారు. అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల్లోనికి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదన్నారు. పరీక్ష కేంద్రాలలోని పరిసర ప్రాంతాలలో జిరాక్స్ కేంద్రాల్లోని మూసివేసి 144 సెక్షన్‌ను అమలుపరచాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డిఓ రత్న కళ్యాణి, పరీక్షల కోఆర్డినేటర్ పిజి రెడ్డి, చీప్ సూపరింటెండెంట్లు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
