Nirmal DSP: నిర్మల్ పట్టణంలో గణపతి నిమజ్జనానికి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు నిర్మల్ డిఎస్పి అల్లూరి గంగారెడ్డి తెలిపారు. గణపతి శోభాయాత్ర జరిగే ప్రదేశాలన్నీ సీసీ కెమెరా నిఘా నీడలో ఉన్నాయని, ప్రతి అంగుళం రికార్డింగ్ చేయబడతాయని స్పష్టం చేశారు. ఇప్పటివరకు పట్టణంలో ప్రశాంతంగా గణపతి నిమజ్జనాలు జరిగాయని, జరగబోయే నిమజ్జన కార్యక్రమానికి ప్రజలు పూర్తిగా సహకరించాలని డిఎస్పి కోరారు.
భారీ బందోబస్తు
నిర్మల్ పట్టణంలో జరగబోయే నిమజ్జన కార్యక్రమానికి 700 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 30 మంది సిఐలు, 40 మంది ఎస్ఐలు, ఐదుగురు డిఎస్పీలు, ఇద్దరు ఏఎస్పీలను నియమించారని, నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో బందోబస్తును పర్యవేక్షిస్తారని డిఎస్పి తెలిపారు.
మహారాష్ట్ర డిజేలపై నిషేధం
నిర్మల్ పట్టణంలో జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమంలో అధిక శబ్దాలను ఇచ్చే డీజీలకు నిషేధం విధించినట్లు డి.ఎస్.పి అల్లూరి గంగారెడ్డి తెలిపారు. ముఖ్యంగా మహారాష్ట్ర డిజేలను పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. అధిక శబ్దాల వల్ల పిల్లలకు వృద్ధులకు ఇబ్బందులు కలుగుతున్నాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రెండు బాక్సులతో శోభాయాత్రను నిర్వహించుకోవాలని అంతకుమించి బాక్సులను ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని డి.ఎస్.పి స్పష్టం చేశారు.