- మున్సిపల్ ముందరే దుర్వినియోగం
- నీటి వాడకానికి పర్మినెంట్ ఏర్పాట్లు
- పట్టించుకోని అధికారులు
illegal use of tap water: జగిత్యాల ప్రతినిధి, జనవరి 9 (మన బలగం): వివిధ ప్రాంతాలకు పాత బస్టాండ్ గుండా ప్రయాణించే ప్రయాణికులకు, ఆ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన పబ్లిక్ నల్లా నీటిని ఓ హోటల్ యజమాని మళ్లించుకొని దందా చేస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోని సంఘటన జగిత్యాల మున్సిపల్ ముందే నెలకొన్న వైనమిది. జగిత్యాల పాత బస్టాండ్‌లో గతంలోని వేసవిలో ప్రయాణికులకు తాగునీటి ఇబ్బందులను గుర్తించి ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని నేరుగా మెయిన్ పైపులైన్ నుంచి నిరంతరం తాగునీరు వచ్చేలా పబ్లిక్ ట్యాప్‌ను ఏర్పాటు చేయించారు. ఆనాటి నుంచి పాత బస్టాండ్‌లోని ప్రజలకు తాగునీటి కష్టాలు తొలిగిపోయాయి. ప్రజల, ప్రయాణికుల తాగునీటి అవసరాలను తీరుస్తున్న ఈ పబ్లిక్ నల్లా నీళ్లు ప్రజల అవసరాలకు దూరవుతున్నాయన్న అభిప్రాయాలు స్థానికంగా వ్యక్తం అవుతున్నాయి.
ఏండ్లుగా రోడ్ల మీద వ్యాపారాలు చేసుకొంటున్న వారికి ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పక్కా షెడ్లను నిర్మించి ఉపాధిని కల్పించారు. ఇందులోని ఓ హోటల్‌ను నిర్వహిస్తున్న ఓ వ్యక్తి నేరుగా పబ్లిక్ నల్లాకు పైపును అమర్చి నేరుగా తన హోటల్‌లోని డ్రమ్ములలో నీళ్లు నింపుకోవడం చేస్తున్నట్లు స్థానికులు అంటున్నారు. ఇందుకోసం తన పక్క వ్యాపారుల నుంచి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు భూమి లోపలి నుంచి పైపును అమర్చి పర్మినెంట్ ఏర్పాట్లు చేసినట్లు స్థానికులు అంటున్నారు. రోడ్డుపైనే పైపును వేసి నల్లా నీళ్లను మల్లించుకొంటున్నా నిత్యం అదేదారిలో తిరిగే మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి ఈ నీటి మళ్లింపు ముచ్చట కనిపించక పోవడంపైనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏకంగా మున్సిపల్ ముందరే పబ్లిక్ ట్యాప్ నీటిని దోచేస్తున్నా మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంపై విమర్శలకు దారితిస్తోంది. ఇలాంటి చర్యలను మొదట్లోనే అదుపులోకి తేవాలని, లేకుంటే పురపాలన గాడి తప్పుతుందనే అభిప్రాయాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
