కేజీబీవీల్లో వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు.. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
Mamada MPDO, KGBV special officers show cause notices: నిర్మల్, నవంబర్ 23 (మన బలగం): కేజీబీవీ విద్యార్థులకు వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను హెచ్చరించారు. మామడ మండల కేజీబీవీ పాఠశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి ఆమె సందర్శించారు. ముందుగా తరగతి గదులు, వంట గది, మరుగుదొడ్లు, స్నానపు గదులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న కేజీబీవీ ప్రత్యేక అధికారి, మండల ఎంపీడీవోలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతులు కల్పించాలని అన్నారు. ప్రతిరోజు విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలన్నారు. వంటకు నాణ్యమైన సరుకులను, కూరగాయలను మాత్రమే వాడాలన్నారు. విద్యార్థులందరికీ స్వచ్ఛమైన తాగునీరు మాత్రమే అందించాలని తెలిపారు. వసతి గృహాల్లో త్రాగునీరు, వంటగది, స్నానపు గదులు, మరుగుదొడ్లు నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పాఠశాల ప్రాంగణంలో పిచ్చి మొక్కలను తొలగించాలని, నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి పి.రామారావు, ఎంపీడీవో సుశీల్ రెడ్డి, కేజీబీవీ ప్రత్యేకాధికారి జ్యోతి, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.