Collector Sandeep Kumar Jha
Collector Sandeep Kumar Jha

Collector Sandeep Kumar Jha: వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలి: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

  • వసతి గృహంలోని విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
  • రైతుల సౌకర్యార్థం అందుబాటులో ఎరువులు ఉంచాలి

Collector Sandeep Kumar Jha: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 9 (మన బలగం): ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. ఆదివారం ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతి గృహాన్ని, వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాంను, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు, సిబ్బందికి కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు జరిగేలా క్షేత్ర స్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. ల్యాబ్, వార్డు, తదితర వాటిని పరిశీలించి అందుబాటులో ఉన్న పరికరాలను ఉపయోగించుకుని వైద్య సేవలు అందించాలని అన్నారు. అనంతరం గ్రామంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతి గృహాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వసతి గృహంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? వారికి ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు? అన్ని మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా లేవా అనే విషయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు ఉంటే తెలపాలని కోరారు.

ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి చక్కగా చదువుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. వసతి గృహంలోని స్టోర్ రూమ్, వంటగది డార్మెట్రీలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు ఆడుకోవడానికి క్రికెట్ కిట్ సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. తదనంతరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోదాంను తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న ఎరువుల గురించి ఆరా తీశారు. ఇప్పటివరకు ఎంత మంది రైతులకు ఎంత ఎరువులు విక్రయించారు, వాటి ధరలు ఎంత అనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్‌లను పరిశీలించారు. ఎరువుల లభ్యత గురించి రైతులు ఆందోళన చెందవద్దని, అందుబాటులో ఎరువులు ఉన్నాయని పేర్కొన్నారు. ఎరువుల లభ్యత, ధరలకు సంబంధించిన పట్టికను గోదాం బయట ఏర్పాటు చేయాలని ప్యాక్స్ కార్యదర్శిని ఆదేశించారు. చివరగా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ దశలో ఉన్న తరగతి గదులు పూర్తి చేయడంలేదనే విషయాన్ని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, నిర్మాణం పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించాలని తహశీల్దార్, ఎంపీడీఓ లను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్శనలో జిల్లా వైద్యాధికారి డా.రజిత, పీఆర్ ఈఈ సుదర్శన్ రెడ్డి, తహశీల్దార్ సురేశ్, ఎంపీడీవో బీరయ్య, మెడికల్ ఆఫీసర్ గీతాంజలి, వార్డెన్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *