AISF
AISF

AISF: విద్యారంగ పెండింగ్ బకాయిలు విడుదల చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు

  • కళాశాలలు బంద్ చేస్తే విద్యార్థుల చదువులు ఎట్లా?
  • సీఎం వద్ద విద్యాశాఖ ఉన్నా బకాయిల విడుదలపై ఇంత నిర్లక్ష్యమా!
  • ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్

AISF: కరీంనగర్, నవంబర్ 19 (మన బలగం): కరీంనగర్‌లో ఏఐఎస్ఎఫ్ నగర ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యంతో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతోందన్నారు. ఫీజు బకాయిలు విడుదల లేకపోవడంతో విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారో అదేవిధంగా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, భవన కిరాయిలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులతో కళాశాలల నిర్వహణ కష్టంగా మారిందని తెలిపార. దసరా తర్వాత డిగ్రీ కళాశాలలు నాలుగు రోజులు నిరవధిక బంద్ చేస్తే వారంలో ఫీజు బకాయిలు విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయలేదన్నారు. ఇచ్చిన మాట తప్పారని, దీంతో రేపటి నుంచి మళ్లీ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు బంద్ నిర్వహిస్తామని, పరీక్షలు బహిష్కరిస్తామని ప్రకటించడంతో దీని ప్రభావం విద్యార్థుల భవిష్యత్తుపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అనేక సెలవులు వల్ల ఇప్పుడిప్పుడే అకాడమిక్ తరగతులు సక్రమంగా జరుగుతూ కొన్ని యూనివర్సిటీల్లో సెమిస్టర్ పరీక్షల నిర్వహణ ఒకటి రెండు రోజుల్లో జరుగనున్నాయని చెప్పారు. కొన్ని యూనివర్సిటీల్లో పరీక్ష ఫీజుల తేదీలు వచ్చాయని, ఇప్పుడు బంద్ చేస్తే విద్యార్థులు చాలా నష్టపోతారని వెల్లడించారు. ప్రభుత్వం ఫీజు బకాయిలపై మొండి నిర్లక్ష్యాన్ని వీడాలని, రేవంత్ రెడ్డి ఆనాడు ప్రతిపక్ష హోదాలో ఫీజు బకాయిలను అధికారంలోకి రాగానే విడుదల చేస్తామని చెప్పారని, నేడు అధికారంలోకి వచ్చి 11 నెలలు కావస్తున్నా పెండింగ్ బకాయిలు ఇవ్వకపోవడం సరికాదన్నారు. సీఎం వద్ద విద్యాశాఖ ఉన్నా ఫీజు బకాయిలు విడుదల చేయడంలో సీఎం నిర్లక్ష్యం సరికాదని, ప్రభుత్వం వెంటనే విద్యార్థులు చదువులను వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని డిగ్రీ కళాశాలల వారితో చర్చించి పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, నగర నాయకులు రవి, రమేశ్, రాజు క్రాంతి, సురేశ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *