MLC elections: నిర్మల్, ఫిబ్రవరి 21 (మన బలగం): రాష్ట్ర శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికలను సజావుగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎమ్మెల్సి ఎన్నికల నిర్వహణపై సిఈఓ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా, ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించి, ఫిబ్రవరి 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని సిఈఓ సూచించారు. అలాగే, ఎన్నికల సిబ్బందికి శిక్షణ అందించాలని, బ్యాలెట్ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను అనువైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలకు ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ అధికారులను నియమించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, జిల్లాలో ఎమ్మెల్సి ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలోని నిర్మల్, బైంసా డివిజన్ లలోని మండల కేంద్రాలలో మొత్తం 46 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 21 లొకేషన్ లలోని పోలింగ్ కేంద్రాలను 8 రూట్లలో విభజించామని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని వసతులు కల్పిస్తున్నామని, ర్యాంప్, వీల్ చైర్, త్రాగునీరు, మెడికల్ సిబ్బంది ని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఓటరు స్లిప్ల లను పంపిణీ చేస్తున్నామని, ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే శిక్షణలు అందించామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓలు రత్నకల్యాణి, కోమల్ రెడ్డి, జడ్పి సీఈఓ గోవింద్, డిపిఓ శ్రీనివాస్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.