- మూడు గంటలపాటు ఉద్రిక్తత
- కలెక్టర్ రావాలంటూ ధర్నా
- రైతులను సముదాయించిన డీఎస్పీ
- ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపే వరకు కదిలేది లేదు
- ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని కలెక్టర్ హామీ
Farmers protest: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రం -గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని తరలించాలని డిమాండ్ చేస్తూ 21 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్న రైతులు, గ్రామస్తులు బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. కలెక్టరేట్ కార్యాలయం ముందు బైఠాయించి ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. సుమారు నాలుగు గంటలు కలెక్టరేట్ కార్యాలయం ముందు భారీ సంఖ్యలో మహిళలు, గ్రామస్తులు, రైతులు బైఠాయించారు. విషయం తెలుసుకున్న డిస్ర్టిక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అల్లూరి గంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని ముట్టడి కార్యక్రమాన్ని విరమించుకోవాలని రైతులకు సూచించారు. రైతులు కలెక్టర్ రావాలంటూ నినాదాలు చేయడంతో డీఎస్పీ విషయాన్ని ఆర్డీవో రత్న కళ్యానికి తెలియజేయగా అక్కడికి చేరుకున్న ఆర్డీవో రైతులతో మాట్లాడారు.
ఫ్యాక్టరీ విషయాన్ని జిల్లా కలెక్టర్‌తో చర్చిస్తామని హామీ ఇచ్చినప్పటికీ రైతులు నేరుగా తమ సమస్యను జిల్లా కలెక్టర్‌కు తెలియజేస్తామంటూ అక్కడే బైఠాయించారు. రైతులు, మహిళలు నాలుగు గంటలు కలెక్టరేట్ కార్యాలయం ముందు బైఠాయించగా అనంతరం జిల్లా కలెక్టర్ రైతుల వద్దకు చేరుకొని రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు కలెక్టర్‌తో మాట్లాడుతూ ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పంట పొలాల మధ్య ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతున్నారని, ఫ్యాక్టరీని వెంటనే ఇక్కడి నుంచి తరలించాలని విన్నవించారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తాం : జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
రైతులతో మాట్లాడిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్యాక్టరీ నిర్మాణం విషయమై ప్రభుత్వానికి మెమోరండం సమర్పిస్తామని, అదనపు కలెక్టర్, ఆర్డీవోలను నేరుగా నిర్మాణ ప్రదేశానికి పంపి విచారణ జరిపిస్తామని నచ్చజెప్పారు. అప్పటివరకు నిర్మాణ పనులను ఆపి వేయించాలని రైతులు విన్నవించగా స్పందించిన కలెక్టర్ తాత్కాలికంగా నిర్మాణ పనులు చేపట్టకుండా ఆదేశాలు జారీ చేస్తామని, మళ్లీ రైతులతో, గ్రామస్తులతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు కలెక్టరేట్ కార్యాలయం నుంచి వెనుదిరిగారు.
కలెక్టర్‌కు వినతి
ఇథనాల్ ఫ్యాక్టరీ వలన ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో దిలావర్‌పూర్, గుండంపెల్లి గ్రామస్తులు ఫ్యాక్టరీ నిలిపివేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇథనాల్ ఫ్యాక్టరీ వనల ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఎటువంటి పనులనైనా ప్రోత్సహించబోమని తెలిపారు. ఫ్యాక్టరీ నిర్మాణ ప్రదేశంలో ఆర్డీవో, తహసీల్దార్ల బృందం దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించవలసిందిగా ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు కలెక్టర్ తెలిపారు.