MP Aravind: జగిత్యాలలో జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు పొందే వరకు వారి వెన్నంటే ఉంటానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం 12 రోజులుగా నిరవధిక నిరసన దీక్ష చేపట్టిన జర్నలిస్టులు బుధవారం దీక్షా స్థలంలో వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. దీక్షకు విచ్చేసి సంఘీభావం తెలిపిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ తాను రాజకీయల్లోకి వచ్చిన నాటి నుంచి ఇళ్ల స్థలాల కోసం జగిత్యాల జర్నలిస్టుల డిమాండ్ వినిపిస్తోందన్నారు. జర్నలిస్టులు కొత్తగా అడిగింది ఏమీ లేదని, గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీ మాత్రమేనన్నారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీ నెరవేరకుండా కొంతమంది నాయకులు అడ్డుపడుతున్నారని తెలిసిందని, ఈ పద్ధతి మానుకోవాలని అర్వింద్ హితవుపలికారు. జర్నలిస్టుల న్యాయమైన కోరిక తీరేవరకు తాను వెన్నంటే ఉంటానన్నారు.
వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని, తాను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేయడమే కాకుండా కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా జర్నలిస్టులకు ఇచ్చే రాయితీ రైల్వే పాసులను పునరుద్ధరించాలని ఎంపీకి వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షులు మోరపల్లి సత్యనారాయణ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోగ శ్రావణి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కృష్ణ హరి తదితర నాయకులు పాల్గొన్నారు.
వంటావార్పుతో జర్నలిస్టుల నిరసన
నిరసన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం దీక్షా స్థలంలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి జర్నలిస్టులు నిరసన తెలిపారు. జర్నలిస్టులే స్వయంగా కూరగాయలు తరిగి వంటలు చేశారు. అనంతరం రోడ్డుపైనే సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇళ్ల స్థలాల కోసం గత 15 రోజులుగా వివిధ రూపాలలో నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వానికి, నాయకులకు చీమకుట్టినట్లయినా లేదని అన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి అవి పరిష్కారమయ్యేలా కృషి చేసే జర్నలిస్టులకే సమస్యలు వస్తే వాటిని తీర్చడానికి ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు.
తమ కలం, గళం ద్వారా ఎంతోమంది నాయకులను తయారు చేశామని అలాంటి నాయకులే జర్నలిస్టుల సేవలను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన కోరికను నెరవేర్చకుంటే రాబోయే రోజుల్లో తమ ఉద్యమాన్ని జిల్లా స్థాయికి విస్తరిస్థామని హెచ్చరించారు. జర్నలిస్టుల దీక్షలకు సారంగాపూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్ జగదీష్, శ్రీనివాస్, తదితరులు సంఘీభావం తెలుపగా వంట వార్పు కార్యక్రమానికి గోసేన అసోసియేషన్ జిల్లా యూత్ అధ్యక్షులు కట్ట శివకుమార్ సహకరించారు.