MLA Pawar Rama Rao Patel: నిర్మల్, నవంబర్ 6 (మన బలగం): పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 4,200 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ తెలిపారు. బుధవారం లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామంలో పనులకు భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రూ.58 కోట్లు మంజూరు కాగా అప్పటి పాలకులు పట్టించుకోలేదన్నారు. పిప్రి పేరున ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ఆ గ్రామానికే నిధులు కేటాయించలేదన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు ప్రభుత్వంతో కొట్లాడి అదనంగా రూ.19 కోట్లు మంజూరు చేయించామన్నారు. మొత్తం రూ.77 కోట్లతో పనులు చేపడతామన్నారు. తలాపున ఉన్న గోదావరి జలాలను వినియోగించుకొని ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే పిప్రి, లోకేశ్వరం, నగర్ బాగాపూర్, ధర్మోరా, గోడిసేరా, రాయపూర్ కాండ్లి, మోలా గ్రామాల్లోని 4,200 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రతి గుంటకు సాగునీరు అందించడమే తన ధ్యేయమన్నారు. ఇప్పటి వరకు పాలకులు సాగునీటిపై దృష్టి సారించకపోవడం మన దురదృష్టం అన్నారు. రైతులంతా సంఘటితంగా ఉండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పిప్రి గ్రామస్తుల సత్కారం
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పిప్రి గ్రామానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందించడానికి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రభుత్వం నుంచి అదనంగా రూ.19 కోట్లు మంజూరు చేయించడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ ఘనంగా స్వాగతించి, సత్కరించారు. ఎమ్మెల్యే చొరవతో తమ చిరకాల వాంఛ తీరిందని, 4 వేల ఎకరాలకు సాగునీరు అందితే తమ గ్రామం సస్యశ్యామలమవుతుందన్నారు. నిధులు మంజూరు చేయించిన పటేల్‌కు రైతాంగం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. కార్యక్రమంలో పలువురు, నాయకులు అధికారులు పాల్గొన్నారు.
