World AIDS Day: నిర్మల్, డిసెంబర్ 2 (మన బలగం): డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ప్రపంచ ఏయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో హెచ్‌ఐవీ, ఏయిడ్స్‌పై అవగాహన పెంపొందించేందుకు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. డిసెంబర్ 1, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు నిర్వహించిన ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిడ్స్ వ్యాధిపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల సహాయర్థమై జిల్లాలో నాలుగు ఎయిడ్స్ నిర్ధారణ, కౌన్సిలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల కోసం ఉచిత మందులతో పాటు ఆసరా పెన్షన్ అందించి ఆర్థికంగా ఆదుకుంటుందని తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కల్పించాలన్నారు.
వ్యాధి అధికంగా ప్రబలే అవకాశం ఉన్న ప్రత్యేక వర్గాలను గుర్తించి ఎప్పటికప్పుడు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని, బాధితులకు సత్వర చికిత్స అందించాలని తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించేందుకు అవసరమైన మెడికల్ సదుపాయాలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హెచ్‌ఐవీ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. అందరూ ఈ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని సమాజాన్ని ఆరోగ్యవంతంగా మార్చడంలో సహకరించాలని కలెక్టర్ కోరారు. ర్యాలీ సందర్భంగా కళాకారులు డప్పు పాటలతో ప్రజలకు ఎయిడ్స్ వ్యాధి నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రత్న కళ్యాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్, తహసీల్దార్లు రాజు, సంతోష్, ఆశా కార్యకర్తలు, కళాకారులు, విద్యార్థులు, వైద్యాశాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.