Bitcoin
Bitcoin

Bitcoin: సార్లు.. ఫారెన్ టూర్లు

  • బాబోయ్ బిట్ కాయిన్ -2
  • ఉపాధ్యాయ వృత్తికే కళంకం
  • విదేశాలకు వెళ్లిన ఉపాధ్యాయులు అనుమతి తీసుకున్నారా?
  • ఉపాధ్యాయ సంఘాల నాయకుల ప్రమేయం
  • ఉత్తమ ఉపాధ్యాయుల్లో బిట్ కాయిన్ వ్యాపారులు
  • అధికారుల అండతోనే అక్రమ వ్యాపారాలు

Bitcoin: నిర్మల్, సెప్టెంబరు 27 (మన బలగం): నిర్మల్ జిల్లాలో విద్యావ్యవస్థ గాడి తప్పింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులు దారి తప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే సదుద్దేశంతో ఉపాధ్యాయులకు ప్రభుత్వం లక్షల్లో వేతనాలను చెల్లిస్తోంది. అవేమీ చాలవన్నట్లు తరగతి గదుల్లో విద్యార్థులను గాలికి వదిలేసి అక్రమ వ్యాపారాలవైపు అడుగులు వేస్తున్నారు. దీంతో నిర్మల్ జిల్లాలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తమైంది. జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అక్రమ దందాలో అధికారులకు సైతం వాటాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు నోరు మెదకపోవడంపై ప్రజల విమర్శలకు బలం చేకూరుస్తోంది. నిర్మల్ జిల్లాను కుదిపేస్తున్న బిట్ కాయిన్ దందాలో ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు ఉపాధ్యాయులే కావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.

ఉపాధ్యాయ వృత్తికే కళంకం

సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఎనలేని గౌరవం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధ్యాయులకు చాలా గౌరవం ఇస్తారు. అలాంటి ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చే విధంగా నేటి గురువులు వ్యవహరిస్తున్నారు. వారి వ్యవహార శైలి మొత్తం ఉపాధ్యాయ వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా ఉంది. అసలైన ఉపాధ్యాయ వృత్తిని పక్కనపెట్టి అక్రమ వ్యాపారాల వెనుక కాసుల కోసం పరుగులు తీస్తున్నారు. పేద పిల్లలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రతి నెల ప్రభుత్వం ఉపాధ్యాయులకు లక్షల్లో వేతనాలను చెల్లిస్తుంది. అయినా వారి ధన దాహం తీరడం లేదు అక్రమ వ్యాపారాల వెనుక పరుగులు పెడుతున్నారు. వ్యాపారం ఏదైనా దాంట్లో ఉపాధ్యాయుల హస్తం ఉండి తీరాల్సిందే అన్నట్లు తయారైంది ఉపాధ్యాయ లోకం. నిర్మల్ జిల్లాలో బిట్కాయిన్ దందాలో సుమారు 200 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. అందులో ఉపాధ్యాయులే ప్రధాన సూత్ర, పాత్రధారులు. సుమారు 150 మంది ఉపాధ్యాయులు ఈ వ్యాపారంతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని ఉపాధ్యాయ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉపాధ్యాయులు సైతం ఈ అక్రమ వ్యాపారంతో సంబంధాలు ఉన్నాయి. వారికి ఉన్న పలుకుబడితో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

విదేశాలకు వెళ్లిన ఉపాధ్యాయులకు అనుమతులు తీసుకున్నారా?

బిట్ కాయిన్ వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించడంతో మన సార్లు స్టార్ల స్థాయికి ఎదిగారు. దీంతో ఆ సంస్థ విదేశాలకు ఉచిత ప్రయాణాలకు ఆఫర్లను ఇచ్చింది. ఇంకేముంది అర్ధ రూపాయికి 100 సార్లు లెక్కించే సార్లు విదేశాలకు వెళ్లే అవకాశం లభించడంతో చంకలు గుద్దుకుంటూ గాలి మోటర్ ఎక్కారు. స్టార్ హోటళ్లలో విందులు వినోదాలతో ఎంజాయ్ చేశారు. వన్ స్టార్ నుంచి ఫోర్ స్టార్ వరకు మెడలో ట్యాగులు వేసుకొని మెమొంటోలు అందుకున్నారు. అయితే వీరు విదేశాలకు వెళ్లేందుకు విద్యాశాఖ అధికారుల నుంచి అనుమతులు పొందారా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరిలో మెదులుతోంది. ఒకవేళ అనుమతి తీసుకుని ఉంటే విజిట్ వేసాపై వెళ్లారా లేక బిజినెస్ వీసాపై వెళ్లారా అనేది తేలాల్సి ఉంది. అనుమతితోపాటు లీవ్‌ పెట్టాల్సి ఉంటుంది. దీనికి అధికారుల అనుమతి తప్పనిసరి. వీటన్నింటిపై లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఉత్తమ ఉపాధ్యాయుల్లో బిట్ కాయిన్ వ్యాపారులు

గత నెలలో ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యాయుల్లో బిట్ కయిన్ వ్యాపారంలో స్టార్లుగా రేటింగ్ పొందిన సార్లు ఉన్నారు. ఉపాధ్యాయ వృత్తిపట్ల నిజాయితీ, నిబద్ధత ఉన్న వారిని ఎంపిక చేసి ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానించాల్సిన అధికారులు పైరవీలకు పెద్దపీట వేసి కాసుల వెనుక పరుగులు తీసే స్టార్లను ఉత్తమ గురువులుగా ఎంపిక చేశారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో దాదాపుగా బిట్ కాయిన్ వ్యాపారంలో తరించిన గురువులే ఉన్నారు.

అధికారుల అండతోనే అక్రమ దందాలు

అధికారుల అండదండలతోనే ఉపాధ్యాయులు అక్రమ వ్యాపారంలో కొనసాగుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో సుమారు 150 మంది ఉపాధ్యాయులు బిట్ కాయిన్ వ్యాపారంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారనే ప్రచారం ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ఉపాధ్యాయులు అక్రమ బిట్ కాయిన్ వ్యాపారంతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండడం, విదేశాలకు టూర్లు వెళ్లడం అధికారుల సన్నల్లోనే జరిగిందనే ఆరోపణలు లేకపోలేదు. ఇంతవరకు ఈ అక్రమ వ్యాపారంతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్న ఐదుగురు ఉపాధ్యాయులు అరెస్టు కాగా విద్యాశాఖ అధికారులు మాత్రం ఇప్పటివరకు ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఈ విషయమై వివరణ కోరెందుకు జిల్లా విద్యాశాఖ అధికారిని ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన స్పందించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *