- విద్యార్థినులను కరిచిన ఎలుకలు
- గతంలోనూ ఇలాంటి సంఘటనలు
- విష సర్పాలు, కోతుల బెడద
- తరచూ కోతుల దాడిలో విద్యార్థినులకు గాయాలు
Rate bite: నిర్మల్, సెప్టెంబర్ 28 (మన బలగం): నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో పలువురు విద్యార్థినులు ఎలుక కాటుకు గురికావడం కలకలం సృష్టించింది. సంఘటన గురువారం రాత్రి జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం రాత్రి డార్మెట్రిలో నిద్రిస్తున్న ఏడో తరగతి విద్యార్థినులను ఎలుకలు కరవడంతో గాయాలయ్యాయి. కాలి మడమలను ఎలుకలు కొరకడంతో గాయాలై రక్తం వచ్చినట్లు తెలిసింది. తమను ఎలుకలు కరిచినట్లు విద్యార్థినులు శుక్రవారం ఉదయం పాఠశాల సిబ్బందికి తెలుపడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించినట్లు సమాచారం. ఎలుకలు కరిచిన ఘటనలో ముగ్గురు విద్యార్థినులు గాయపడ్డారు. పాఠశాలలో ఇలాంటి సంఘటనలు జరగడం ఇది మొదటి సారి కాదు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు వెలుగుచూశాయి.
ఈ ఏడాది ఆగస్టు నెల చివర్లో 8,9వ తరగతి విద్యార్థినులు ఎలుక కాటుకు గురయ్యారు. ఇటీవలే పాఠశాలకు మంచాలు సైతం మంజూరయ్యాయి. విద్యార్థినులు అందరికీ సరిపడా మంచాలు ఉన్నాయి. అయినా ఎలుకలు మంచాలపైకి ఎక్కి దాడి చేస్తుండడం విస్మయం కలిగిస్తోంది. కాగా విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా అలాంటిదేమీ లేదని కొట్టిపారేయడం గమనార్హం. పాఠశాల, జూనియర్ కళాశాలలో కలిపి 650 మంది వరకు విద్యార్థినులు ఉన్నారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా విద్యార్థినుల రక్షణ గాలిలో దీపంలా మారింది. విద్యాశాఖ ఉన్నతాధికారులు తరచూ పాఠాలను సందర్శిస్తున్నా సమస్యలు పరిష్కారానికి నోచు కోవడంలేదు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండడంతో జిల్లా, రాష్ర్ట స్థాయి కార్యక్రమాలకు పాఠశాల వేదికగా మారుతుంది. జిల్లా, రాష్ర్ట స్థాయి అధికారులు, రాజకీయ ప్రముఖులు తరచూ సందర్శించే పాఠశాల పరిస్థితి ఇలా ఉండడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాములు, కోతుల బెడద
పాఠశాలకు విస్తీర్ణం పెద్దగా ఉండడంతో ఖాళీ స్థలంలో గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగి విష సర్పాలకు ఆవాసరంగా మారుతోంది. తరచూ పాములు కనిపిస్తుండడంతో విద్యార్థినులు భయాందోళను గురవుతున్నారు. వర్షాకాలంలో పాముల బెడద అధికంగా ఉంటుంది. తరగతి గదులు, విద్యార్థినులు పడుకునే డార్మెట్రిలోకి పాములు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. పాములతోపాటు కోతుల బెడదతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరగతి నుంచి బయటకు వచ్చేందుకు జంకాల్సిన పరిస్థితి నెలకొంది. భోజనశాలకు వెళ్లాలన్నా, బాత్‌రూమ్‌కు వెళ్లాలన్నా, తాగునీటి కోసం వెళ్లాలన్నా భయపడుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి కోతులు దాడి చేస్తాయో తెలియని పరిస్థితి ఉంది. నెలలో ఒకటి రెండు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తరచూ కోతుల దాడితో విద్యార్థినుల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు.