Journalists House Sites Issue Nirmal
Journalists House Sites Issue Nirmal

Journalists House Sites Issue Nirmal: 29న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన

గాండ్ల రాజశేఖర్ జాతీయ సభ్యునిగా ఏకగ్రీవ తీర్మానం

Journalists House Sites Issue Nirmal: నిర్మల్, ఆగస్టు21 (మన బలగం): నిర్మల్ జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కోసం దశలవారీగా ఉద్యమాలు చేపట్టనున్నట్లు టీయూడబ్ల్యూజే నిర్మల్ జిల్లా అధ్యక్షులు అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్, భూమయ్య తెలిపారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా కమిటీ ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఈ సమస్య పరిష్కారం కోసం రెండు దశల ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించిందని వారు తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా, గాండ్ల రాజశేఖర్‌ను జాతీయ కమిటీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. జిల్లా అధ్యక్షులు కొండూరు రవీందర్, ప్రధాన కార్యదర్శి వెంక గారి భూమయ్య మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇంటి స్థలాల విషయంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రస్తావించారు.

రాష్ట్రంలో అనేక చోట్ల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించినప్పటికీ, నిర్మల్ జిల్లాలో మాత్రం ఈ ప్రక్రియలో పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, మొదటి దశగా ఈ నెల 25వ తేదీన మండల స్థాయిలో నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ఆ రోజు అన్ని మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రాలు అందజేయనున్నారు. రెండో దశలో ఈ నెల 29వ తేదీన జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట భారీ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో జిల్లాలోని అన్ని మండలాల నుంచి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని, తమ డిమాండ్లను కలెక్టర్‌కు విన్నవించాలని నిర్ణయించారు. ప్రభుత్వం స్పందించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా, కొంతకాలంగా నిలిచిపోయిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేసి, జిల్లా మహాసభను నిర్వహించాలని కూడా తీర్మానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రమోద్ రెడ్డి, జిల్లా స్పెషల్ మీడియా కన్వీనర్ యోగేశ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వేణుగోపాల్, గుమ్ముల అశోక్, పూసల పోశెట్టి, రాచమల్ల రాజశేఖర్, టి. రవీందర్, జిల్లా సంయుక్త కార్యదర్శి జల్దా మనోజ్, సట్ల హనుమన్లు , ప్రచార కార్యదర్శి రాజేశ్వర్, జిల్లా కార్యవర్గ సభ్యులు షిండే మహేశ్, కొల్లి రాజేశ్వర్, డీఎస్ మధు పలువురు జర్నలిస్టు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *