Collector Satya Prasad: ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 3 (మన బలగం): పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని అదర్శ మోడల్ స్కూల్‌లో మంగళవారం జిల్లా విద్యాధికారి రాముతో కలిసి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాల తీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. క్లాస్ రూమ్‌లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని కలెక్టర్ ఆరా తీశారు. అదే విధంగా ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా లేదా అని కలెక్టర్ హాజరు పట్టికను పరిశీలించారు. పాఠశాలలోని ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించాలని, సర్కారు బడుల్లో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, భావితరాలకు అవసరమైన విద్యా బోధన చేయడం జరుగుతున్నదని తెలిపారు. ఇందులో భాగంగా వంట గదిని, డైనింగ్ హాల్‌తో పాటు ఆహార పదార్థాలను, స్టోర్ రూంను తనిఖీ చేశారు. అలాగే స్కూల్‌కు అనుబంధంగా ఉన్న గర్ల్స్ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి హాస్టల్ గదులను, వసతులను పరిశీలించారు. కార్యక్రమంలో తహశీల్దార్ ప్రసాద్, ఎంపిడిఓ సాంబరి చంద్రశేఖర్ పాల్గొన్నారు.