CM Revanth Reddy new strategy
CM Revanth Reddy new strategy

CM Revanth new strategy: కౌన్సిల్‌లో బలంలేని కాంగ్రెస్.. రేవంత్ రెడ్డి వ్యూహం ఇదే

  • శాసన మండలిలో బలం లేని కాంగ్రెస్
  • కౌన్సిల్‌లో ఉన్నది నలుగురు సభ్యులే
  • బిల్లుల పాస్‌కు తప్పని గండం
  • గట్టెక్కడంపై సీఎం రేవంత్ కొత్త స్ర్టాటజీ
  • ఎమ్మెల్సీల జాయినింగ్‌కు ఫోకస్
  • చైర్మన్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధం

CM Revanth Reddy new strategy: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొన్నటి పార్లమెంటు ఎలక్షన్లలోనూ తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొన్నది. ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా గెలువలేకపోయింది. అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మిత్రపక్షమైన సీపీఐ ఒక్క స్థానంలో గెలుపొందింది. ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్, దాని మిత్రపక్షం సీపీఐకి కలిపి మొత్తం 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అమలు కావాలంటే చట్టరూపం దాల్చాల్సి ఉంటుంది. అందుకు ప్రతి బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందాల్సి ఉంటుంది. తరువాత శాసనమండలిలో పాస్ కావడం తప్పనిసరి. శాసనసభలో కాంగ్రెస్‌కు మెజార్టీ ఉండడంతో బిల్లులను సునాయసంగా పాస్ చేయించుకోగలదు. కానీ మండలిలో అనుకున్నంత సులువు కాదు. కాంగ్రెస్‌కు కేవలం నలుగురు ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. మండలి చైర్మన్‌ సహా 34 మంది బీఆర్ఎస్‌కు చెందిన వారే కావడం గమనార్హం. ఎంఐఎం, బీజేపీలక ఒక్కో సభ్యుడు ఉన్నారు.

40 మంది ఎమ్మెల్సీలు ఉన్న మండలిలో కాంగ్రెస్ బలం నాలుగు. 2019 నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి కొనసాగుతున్నారు. తాజాగా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ఇటీవల విజయం సాధించారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక ఎమ్మెల్సీ ఉన్న కాంగ్రెస్‌కు ప్రస్తుతం నలుగురు సభ్యులు ఉన్నారు.

మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌తో కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. వీళ్లిద్దరూ కాంగ్రెస్‌తో టచ్ ఉన్నారన్న విషయం బహిరంగ రహస్యమే. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల్లో బస్వరాజ్ సారయ్య వచ్చే ఏడాది రిటైర్ కాబోతున్నారు. ఆయనకు రెన్యువల్ ఆఫర్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌తోనూ రాయబారాలు కొనసాగించినట్లు తెలిసింది. కాగా మాజీ మంత్రి కడియం శ్రీహరి రావు పలువురు ఎమ్మెల్సీలతో కాంటాక్ట్ అయినట్లు తెలుస్తోంది. బుగ్గారపు దయానంద్, మల్లేశం, శేరి సుభాష్ రెడ్డి పదవీ కాలం మరో ఏడాదిలో ముగియనుంది. వీరితోనూ సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం.

ఏఐసీసీ సూచనల మేరకే ఎమ్మెల్సీలతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మండలిలో సంఖ్యా బలాన్ని పెంచుకునేందుకు అవసరమైన వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పలువురితో సంప్రదింపలు జరిపిన కాంగ్రెస్ పెద్దలు వారిని ఎలాగైనా హస్తం గూటికి చేర్చుకోవాలని చూస్తోంది. ప్రస్తతం బీఆర్ఎస్ పరిస్థితి అంతంతమాత్రమే ఉండడంతో ఆ పార్టీ ఎమ్మెల్సీలు పార్టీ మారాలా వద్దా అన్న సందిగ్ధంలో పడ్డారు. కొనసాగడం కన్నా అవకాశం వచ్చినప్పుడు పార్టీ మారడంలో తప్పులేదని కొందరు భావిస్తుంటే, సమయం వచ్చినప్పుడు చూద్దాంలే, ఇప్పుడే ఎందుకు తొందరపడడం అన్న ధోరణిలో ఉన్నారు.

ఏది ఏమైనా అధికార కాంగ్రెస్ మండలిలో పట్టు సాధించేందుకు శక్తి యుక్తులను ప్రయోగిస్తు్న్నది. ఉన్న ఫళంగా సంఖ్యా బలం పెంచుకోవాలంటే జాయినింగ్సే మార్గమని భావిస్తున్నది. కాంగ్రెస్‌లో చేరే ఎమ్మెల్సీ సంఖ్యను బట్టి మండలి చైర్మన్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అదే జరిగితే శాసన సభ, శాసన మండలిలోనూ కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగనున్నది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *