Minister Seethakka: నిర్మల్, డిసెంబర్ 13 (మన బలగం): మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్, మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శుక్రవారం నిర్మల్ కలెక్టరేట్ ప్రాంగణంలో అంబులెన్సులు, ఇందిరా మహిళా శక్తి, విజయ డెయిరీ క్యాంటీన్లను కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం సమావేశం మందిరంలో అధికారులతో జిల్లా అభివృద్ధిపై మంత్రి సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో అమలు చేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం జిల్లాలో 1లక్ష 93 వేల దరఖాస్తులు వచ్చాయని, సమర్థవంతంగా సర్వే పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 57 సంక్షేమ వసతి గృహాలలో బాలశక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని 30వేల విద్యార్థులకు పౌష్టికారం, వైద్య చికిత్సలతో పాటు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళలు అభివృద్ధి చెందినపుడే సమాజం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.
మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. పావలా వడ్డీకే కోటి మంది మహిళలకు రుణాలను అందిస్తామని అన్నారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేలా 17 రకాల వ్యాపారాలను గుర్తించామని అన్నారు. అభివృద్ధిలో మహిళలు భాగస్వాములు కావాలని కోరారు. బ్యాంకు రుణాలు తీసుకోవడం, తిరిగి చెల్లించడంలో జాతీయ స్థాయిలో అవార్డులు తీసుకున్నటువంటి జిల్లా మహిళలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. మహిళల కోసం ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామని తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచామని చెప్పారు. యువతకు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని అన్నారు. అభివృద్ధికి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. అనంతరం ఇందిరా క్రాంతి పథకం మహిళా సంఘాలకు 400 కోట్ల బ్యాంకి లింకేజీ చెక్కును, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అమ్మ రక్షిత కార్యక్రమ పోస్టర్లను మంత్రి అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలలో అదనపు కలెక్టర్లు పైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, అధికారులు మహిళాలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.