MLA Power Rama Rao Patel: ముధోల్, డిసెంబర్ 14 (మన బలగం): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ తెలిపారు. భైంసా పట్టణంలోని రాహుల్ నగర్ మహాత్మా జ్యోతిబాఫూలే (జామ్ గావ్) స్కూల్‌ను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన ఉండాలన్నారు. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నదని, అందుకు తగిన విధంగా విద్యా ఫలితాలు ఉండాలన్నారు. పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసే విద్యార్థుల్లో పౌష్టికాహారలోపం ఉండకుండా మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనే క్రమంలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తన పరిశీలనలో తేలితే సంబంధిత సిబ్బందిపై చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే హెచ్చరించారు.
మధ్యాహ్న భోజన కిచెన్‌ను పరిశీలించి వంట సరుకుల నాణ్యత, కోడిగుడ్ల పరిమాణం, చిక్కీలను, భోజనం నాణ్యతను, కిచెన్‌లో పరిశుభ్రతను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతోపాటు వండిన ఆహారం పరిమాణాన్ని ప్రధానోపాధ్యాయులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఆహారం వండే విధానం, మెనూ ప్రకారం పిల్లలకు అందిస్తున్నారా లేదా అని పరిశీలించాలన్నారు. విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతను తెలియజేయాలని, భోజనానికి ముందు చేతులు సబ్బుతో కడుక్కోవాలని సూచించారు. విద్యా కానుక కింద అందించిన బ్యాగ్‌లు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు అందరికీ అందాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను గురించి విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. విద్యా శాఖాధికారులు తరచూ తమ పరిధిలోని పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేయాలని సూచించారు.
