అంబేద్కర్‌ను అవమానించిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి డిమాండ్
protest: కరీంనగర్, డిసెంబర్ 30 (మన బలగం): రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా అహంకారపూరితమైన మరియు తిరస్కార స్వరంతో మాట్లాడడం తన అహంకారాన్ని రుజువు చేసిందన్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అత్యుత్తమ పదవిలో ఉండి చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అమిత్ షా అన్ని వర్గాల ప్రజల కోసం రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన అంబేద్కర్‌ను కించపరిచే, అగౌరవ పరిచే వ్యాఖ్యలు చేయడం హోం మంత్రి హోదాకు తగదన్నారు. ఇది దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీయటమేనన్నారు. భారతదేశ లౌకిక మరియు ప్రగతిశీల రాజ్యాంగ రూపశిల్పిపైన చూపిన అగౌరవాన్ని, అపహాస్యం చేయడానికి ప్రయత్నించారని విమర్శించారు.
అవమానకర వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగంపై బీజేపీ చేస్తున్న దాడికి వ్యతిరేకంగా భారత ప్రజల నుంచి పెరుగుతున్న ప్రతిఘటన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ హిందూత్వ శక్తులచే నిరంతరం దాడికి గురవుతున్న భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన నిశ్చయాత్మక చర్యల నిబంధనల పరిరక్షణ కోసం పోరాడటానికి లక్షలాది మందిని ప్రేరేపించారని పేర్కొన్నారు. భారత ప్రజలపై మనువాద భావజాలాన్ని రుద్దేందుకు ఈ శక్తులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. అమిత్ షా, బీజేపీ వారి ఆలోచనలు కులతత్వంతో ఉన్నాయని, రాజ్యాంగం పట్ల నిజమైన గౌరవం లేదని మరోసారి రుజువయిందన్నారు. ఎన్నికల సమయంలోనే కాకుండా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ తరచుగా వ్యక్తం చేసే అసహనం, భారతదేశంలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం డాక్టర్ అంబేద్కర్ పోరాడి నడిపిన ఉద్యమాలు మరియు ఆదర్శాల పట్ల వారి లోతైన ద్వేషాన్ని వెల్లడిస్తుందన్నారు.
మతోన్మాదుల నుంచి దేశానికి ప్రమాదం పొంచి ఉందని, అమిత్ షా విద్వేషాలకు కారకుడని విమర్శించారు. అమిత్ షా వ్యాఖ్యల పట్ల రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్ షా రాజీనామా చేసే వరకు ఉద్యమాలను కొనసాగిస్తామని మిల్కూరి వాసుదేవ రెడ్డి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు గీట్ల ముకుందర్ రెడ్డి, పైడిపల్లి రాజు, కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, యు.శ్రీనివాస్, ఎడ్ల రమేశ్, నరేశ్ పటేల్, సీపీఐ, సీపీఎం జిల్లా నాయకులు సత్యనారాయణచారి, బెక్కంటి రమేశ్, రాజు, తిప్పారపు సురేశ్, పుల్లెల మల్లయ్య, రాయికంటి శ్రీనివాస్, రాజ్ కుమార్, శ్రీకాంత్, అశోక్, అరవింద్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.