CM Cup
CM Cup

CM Cup: సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలు షురూ

  • క్రీడలు విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీస్తాయి
  • జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

CM Cup: నిర్మల్, డిసెంబర్ 16 (మన బలగం): క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం సీఎం కప్ -2024 జిల్లా స్థాయి క్రీడా పోటీల ప్రారంభం సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ స్ట్రీడియంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులనుద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సీఎం కప్ క్రీడలు యువతకు క్రీడా ప్రాముఖ్యతను చాటి చెప్పే గొప్ప వేదిక అన్నారు. యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు వారి ప్రతిభను మెరుగుపరచడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తాయన్నారు. సీఎం కప్ క్రీడా పోటీలలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయిలో పాల్గొనేలా యువతను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో విజయవంతంగా పోటీలను నిర్వహించామని, మంగళవారం నుంచి 4 రోజులపాటు జిల్లా స్థాయిలో క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడలలో పాల్గొంటారని చెప్పారు. క్రీడా పోటీల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.

గెలుపోటములు సహజమని, కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసమే నిజమైన విజేతలుగా నిలబెడతాయి అన్నారు. యువత చదువుతోపాటు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పథకాలు సాధించాలని అన్నారు. క్రీడా నైపుణ్యాన్ని పిల్లల్లో అభివృద్ధి చేయడానికి, నైపుణ్యం కలిగిన కోచ్‌లను నియమించడానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతానని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల కోసం నిర్మల్ జిల్లాలో స్పోర్ట్స్ పాఠశాల నిర్మించే విధంగా తమవంతు ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం విద్యా, ఉద్యోగాలలో రెండు శాతం రిజర్వేషన్ కల్పి్స్తారని, క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సాధించాలని కోరారు. అనంతరం కలెక్టర్ క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడలను ప్రారంభించారు.
జిల్లా స్థాయిలో జరిగే క్రీడా పోటీలలో ఈ రోజు కబడ్డీ, ఖోఖో, బేస్ బాల్, సాఫ్ట్ బాల్, ఆర్చరీ, జూడో పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో జిల్లా వ్యాప్తంగా 18 మండలాల నుంచి సుమారు 1700 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఖమర్ అహ్మద్, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, ఒలంపిక్ అసోసియేషన్ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రెటరీ రవీందర్ గౌడ్, పేటా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూక్య రమేశ్, భోజన్న, కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి సునీల్, వివిధ క్రీడా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లాలోని న్యాయమ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

CM Cup
CM Cup

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *