- కేటీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే
- పాలనా వైఫల్యాలపై డైవర్షన్ పాలిటిక్స్
- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు
Jagtial BRS: జగిత్యాల, అక్టోబర్ 28 (మన బలగం): కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక వారి బామ్మర్ది రాజ్‌పాకాల ఇంటిపై సోదాల పేరుతో పోలీసులు దౌర్జన్యంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూన్నామని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. సోమవారం బీఆర్ఎస్ కార్యాలయంలో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జిల్లా పరిషత్ తొలి చైర్‌పర్సన్ దావ వసంత సురేశ్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలల పాలనలో రోజుకో అరాచకం సృష్టిస్తోందని ఆరోపించారు. ఎమర్జెన్సీని తలపించేలా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా, మూసి సుందరీకరణ, బెటాలియన్ కానిస్టేబుళ్ల వ్యవహారం, నిరుద్యోగుల సమస్య, రైతుల రుణమాఫీ ఇలాంటి ఎన్నో విషయాల్లో ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. కేటీఆర్ బామ్మర్ది, కుటుంబ సభ్యులు గృహప్రవేశం సందర్భంగా విందు చేసుకుంటే కక్ష గట్టి కేసులు నమోదు చేశారని మండిపడ్డారు.
ప్రజల్లో బీఆర్ఎస్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందుగా చెప్పిన ప్రకారం పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందని అన్నారు. ఇచ్చిన వాగ్దానాల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్నారు. రుణమాఫీ, రైతు భరోసా ఏమైందని ప్రశ్నించారు. సీఎం హోదాలో హుందాగా ఉండాలని, కేసీఆర్‌ను తిట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ కలిసిపోతున్నాయని, బండి సంజయ్ వ్యాఖ్యలను చూస్తే తెలిసిపోతుందని అన్నారు. అనంతరం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ కేటీఆర్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రజల దృష్టి మరల్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర చేస్తోందన్నారు. 70 ఏళ్ల వయసున్న మహిళలు, కుటుంబ సభ్యులు ఉంటే రేవ్ పార్టీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు చూస్తే గంజాయి వ్యాపారం చేస్తున్నట్టు ఉన్నాడని ఆరోపించారు. మొదటి ఎన్నికల్లో పుస్తెల తాడు కుదువ పెట్టానని, ఇప్పుడు రూ.150 కోట్లు ఖర్చు పెట్టాడని, అవి ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
అనంతరం దావ వసంత సురేశ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందన్నారు. ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన బామ్మర్ది రాజ్ పాకాల ఇంటిపై పోలీసులు దౌర్జన్యంగా దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ప్రతిపక్షాల కుటుంబసభ్యుల ఇంట్లో ఏం జరుగుతున్నాయో తెలుసుకోవడం పక్కన పెట్టి ధాన్యం కొనుగోళ్లపై, హమాలీల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. మహిళలందరు కలిసి కూర్చుని తింటే దాన్ని ఒక రేవ్ పార్టీ కింద చిత్రీకరించడంపై మండిపడ్డారు. మహిళలను కించపరిచే ఇటువంటి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఉన్నందుకు మహిళలందరు చీకొడుతున్నారని అన్నారు. కేసీఆర్ పాలన చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, ఉపాధ్యక్షుడు వొల్లెం మల్లేశం, నాయకులు అమీన్ భాయ్, ఆసీఫ్, రిజ్వాన్, గాజుల శ్రీనివాస్, మోర వెంకటేశ్వర్లు, నీరటీ శ్రీనివాస్, మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.