జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
Swachh Autos Start: జగిత్యాల, అక్టోబర్ 23(మన బలగం): జగిత్యాల జిల్లా కేంద్రంగా మారి శరవేగంగా అభివృద్ధి చెందుతుండగా మున్సిపల్‌పై ఒత్తిడి, పనిభారం పెరుగుతున్నా ప్రజల సహకారంతోనే పట్టణం పరిశుభ్రతకు నోచుకుంటోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక వివేకానంద మినీ స్టేడియంలో జగిత్యాల పురపాలక సంఘానికి చెందిన తొమ్మిది నూతన స్వచ్ఛ ఆటోలను ఆదనపు కలెక్టర్ గౌతం రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్‌లతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సందర్భంలో జగిత్యాల మున్సిపల్‌పై ఒత్తిడి, పనిభారం పెరిగిందని, అందుకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సదుపాయాల కల్పన కోసం ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు.
ప్రజలు సరైన పద్ధతిలో తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి అందజేయాలని ఎమ్మెల్యే కోరారు. గత పాలకుల నిర్లక్ష్యంతో జగిత్యాల పట్టణం నిర్లక్ష్యానికి గురైందని, సరైన మాస్టర్ ప్లాన్ లేక అనేక సమస్యలు నెలకొంటున్నాయని అన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టణాన్ని పరిశుభ్రంగా పచ్చదనంగా ఉండేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు. పట్టణ పారిశుధ్య కార్మికుల కోసం ఐఎంఏ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేయనున్న మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. నూతన నిర్మాణాలు నిబంధనలకు లోబడి చేపట్టాలి ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ చిరంజీవి, డీఈ యాదగిరి, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.