International Day of Persons with Disabilities: నిర్మల్, డిసెంబర్ 3 (మన బలగం): దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని టీఎన్జీవో సంఘ భవనంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్‌ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఫైజాన్ అహ్మద్ (జిల్లా ఇన్చార్జి సంక్షేమ అధికారి) సీనియర్ సివిల్ జడ్జి రాధికలతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో దివ్యాంగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా కలెక్టర్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమానికై ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నాయని, వాటిని వినియోగించుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని తెలిపారు.
దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారాదని సూచించారు. దివ్యాంగులకు ఎటువంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. దివ్యాంగుల చట్టాలు, వారికి ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. ఇదివరకే జిల్లాలో అలిమ్కో సంస్థ వారి ఆధ్వర్యంలో క్యాంపులు నిర్వహించామని తెలిపారు. అర్హులైన 868 మంది దివ్యాంగులకు 1429 ప్రత్యేక పరికరాలు త్వరలోనే అందిస్తామన్నారు. సదరం క్యాంపులు నిర్వహించి అర్హులైన వారికీ ధ్రువ పత్రలను అందిస్తామని తెలిపారు. అలాగే బస్ పాస్, సబ్సిడీ రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక ర్యాంపు, వీల్ చైర్ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ, దివ్యాంగుల హక్కుల పరిరక్షణ అనేది సమాజంలో దివ్యాంగులకు సమాన అవకాశాలు, హక్కులు, గౌరవాన్ని అందించే ప్రాముఖ్యమైన అంశమని తెలిపారు.
భారతదేశంలో దివ్యాంగుల హక్కుల చట్టం, 2016 దీనికి బలమైన చట్టబద్ధతను కల్పించిందని దివ్యాంగుల హక్కులను పరిరక్షించడానికి వారి జీవిత ప్రమాణాలను మెరుగుపరచడానికి ముఖ్యమైన నిబంధనలు చేయడం జరిగిందని తెలిపారు. ఉద్యోగాల్లో, విద్యాలో, పౌరసేవలలో 4% రిజర్వేషన్‌ను అందించడంతో పాటు దివ్యాంగుల పట్ల వివక్ష చేయకుండా, వారి హక్కులను పరిరక్షించే విధానాలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. దివ్యాంగుల పట్ల సానుకూల దృష్టి, గౌరవం చూపుతూ వారి హక్కులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విజయం సాధించిన దివ్యాంగులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు కలెక్టర్ అందజేసి అభినందించారు. కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి, డిఎంహెచ్ఓ రాజేందర్, మెప్మా పీడీ సుభాష్, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, డీఎస్పీ ప్రభాకర్, ఎసిడిపివో నాగలక్ష్మి, సంక్షేమ శాఖ అధికారులు, దివ్యాంగుల సంక్షేమ సంఘ నాయకులు, దివ్యాంగులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.