- కమ్ముకున్న పొగలు.. భయాందోళనలో రోగులు
- రోగులను బయటకు పంపిన సిబ్బంది
- మంటలను ఆర్పిన ఫైర్ ఫైటర్స్
- తప్పిన ప్రాణాపాయం
Fire accident: నిర్మల్, అక్టోబర్ 20 (మన బలగం): నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని రెండో ఫ్లోర్లోని జనరల్ వార్డులో షార్ట్ సర్క్యూట్తో ఏసీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చెలరేగిన మంటలు వార్డు మొత్తం వ్యాపించడంతో వైద్యులు, రోగులు భయాందోళనలకు గురయ్యారు. వార్డు మొత్తం దట్టమైన పొగలు వ్యాపించడంతో వెంటనే రోగులను వార్డు నుంచి బయటకు పంపించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకొని వెంటనే వంటలను ఆర్పి వేశారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదంతో వార్డు కిటికీలతో పాటు సామగ్రి కాలిపోయింది. మంటల దాటికి ఫర్నిచర్, ఆరోగ్యశ్రీ ఫైళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. కిటికీల అద్దాలు భారీ శబ్దాలతో పేలిపోవడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే రోగులను రెండో ఫ్లోర్ నుంచి కిందికి పంపడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో సుమారు 200 పైగా రోగులు ఉన్నారు. సకాలంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.