- ప్రజలు సహకరించాలి
- పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు
Peddapalli MLA: మనబలగం, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే విజయరమణ రావు కోరారు. కోటి నలభై తొమ్మిదిన్నర లక్షల రూపాయలతో పెద్దపల్లి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం శంకుస్థాపనలు చేశారు. పెద్దపల్లి పట్టణంలోని 19, 23 వార్డుల్లో టీ.యు.ఎఫ్.ఐ.డి.సి నిధులతో కోటి నలభై తొమ్మిదిన్నర లక్షల రూపాయలతో పలు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, షెడ్, కాంపొండ్ వాల్ నూతన నిర్మాణాలకు ఆదివారం స్థానిక కౌన్సిలర్లు వార్డు ప్రజలతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ.. పెద్దపల్లి పట్టణాన్ని సుందరమైన పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రజలందరూ సహకరించాలి కోరారు. నూతన అభివృద్ధి కార్యక్రమాల నిర్మాణాల నాణ్యత విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని కాంట్రాక్టర్లకు సూచించారు.
అలాగే అధికారులు అందరూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. వార్డులో పర్యటించినప్పుడు మహిళా సోదరీమణులు పలు సమస్యలను తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, ఆ సమస్యలను అన్నింటినీ దశల వారీగా పరిష్కరించి తీరుతామని హామీ ఇచ్చారు. గత పాలకుల హయాంలో పెద్దపల్లి పట్టణాన్ని అధ్వానమైన స్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. ఎక్కడ చూసినా గుంతలతో కూడిన రోడ్లు కనిపిస్తున్నాయని చెప్పారు. వాటన్నింటినీ తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రభుత్వం మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ సౌకర్యం, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పంపిణీ లాంటి సంక్షేమ పథకాలతో మహిళలకు పెద్ద పీట వేస్తున్నదని గుర్తు చేశారు. కార్యక్రమంలో పెద్దపల్లి పట్టణ కౌన్సిలర్లు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్, పలు వార్డుల ప్రజలు, మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.