Budget 2025: కరీంనగర్, మార్చి 19 (మన బలగం): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా కేవలం 7.57% నిధులు మాత్రమే కేటాయించారని, దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల విద్యార్థులకు విద్యను అందించడం సాధ్యం కాదని, కేవలం కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన బడ్జెట్ అని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేశ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను పక్కనపెట్టి ప్రజలను మోసం చేసి ప్రజాపాలన పేరుతో కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ విధానాలను కొత్త పద్ధతుల్లో అమలు చేస్తుందని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో 15% నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి హామీలను అమలు పరచడంలో శ్రద్ధ చూపడం లేదని రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ ప్రభుత్వం విద్యను అందుబాటులోకి తేవడానికి ఈ బడ్జెట్లో కేటాయించిన నిధులు ఏ మూలకు సరిపోవని తెలిపారు. ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని ఎద్దేవా చేశారు.
ఇప్పటికే రాష్ట్రంలో కార్పొరేట్ ప్రైవేటు విద్యాసంస్థలు విద్యారంగాన్ని ప్రభుత్వాలను శాసించే విధంగా తయారయ్యాయని ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జె్ట్‌లో విద్యారంగానికి కోత పెట్టడం సరైనది కాదని తెలిపారు. ప్రజల సంక్షేమం అంటే విద్య, వైద్య, ఉపాధి అనే అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని ఈ మూడు ఉంటే ప్రజల సంక్షేమం ఉన్నట్టేనని పాలకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగం అభివృద్ధికి నోచుకోవాలంటే పేద వర్గాల అందరికీ ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండాలంటే రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు వెంటనే కేటాయించాలని ప్రభుత్వం బడ్జెట్‌పై సమీక్ష చేసుకుని సవరణ చేసి నిధుల కేటాయింపు పట్ల ఆలోచించాల్సిన అవసరం ఉందని విద్యారంగ నిపుణుల విద్యార్థి సంఘాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని తక్షణమే బడ్జెట్ కేటాయింపులు పెంచాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని మచ్చ రమేశ్ హెచ్చరించారు.