- ఉద్యోగ, ఉపాధి రంగాల ఊసే లేని బడ్జెట్
- బడ్జెట్‌లో పత్తాలేని నిరుద్యోగభృతి
- రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లేవు
- మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్న యువత
Budget 2025: కరీంనగర్, మార్చి 19 (మన బలగం): రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేడు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో యువజన రంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని, రేవంత్ ప్రభుత్వం యువజన కమిషన్ ఏర్పాటు హామీని ప్రకటించకపోవడం బాధాకరమని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగేంధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగేంధర్ మాట్లాడుతూ రేవంత్ సర్కారు ప్రజా ప్రభుత్వమంటూ ప్రచారార్భాటాలకు ఇస్తున్న ప్రాధాన్యత ఉద్యోగ కల్పనలపై లేదన్నారు. పేరుకు మాత్రమే జాబ్ క్యాలెండరు ప్రకటించిందని వారు విమర్శించారు. యూత్ డిక్లరేషన్లో జాబ్ క్యాలెండర్తోపాటు నిరుద్యోగ భృతి రూ.నాలుగు వేలు ఇస్తామని ప్రకటించిందని, విద్య, ఉపాధి కల్పనకు కృషి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారన్నారు.
యువతకు 1000 కోట్ల గ్రాంట్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి రంగానికి కేవలం 900 కోట్ల నిధులు కేటాయించడం సరికాదన్నారు. నిరుద్యోగ యువత ఇటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉండగా, ప్రభుత్వం అధికారం చేపట్టి వారికి భవిష్యత్తుపై తిరిగి ఆశను రగిల్చిందని భట్టి చెప్పారని, కానీ వాస్తవ అమలులో చాలా తేడాలున్నాయన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల సత్వర భర్తీతో పాటు ఇతర రంగాలలో ఉపాధి కల్పించే దిశగా, ముఖ్యంగా మహిళలు మరియు వెనుకబడిన వర్గాల యువత కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం విస్మరించిందన్నారు. అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖకు 12,393 కోట్లు కేటాయింపు చేశారని, అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందేలా అన్ని రకాల వైద్య సామగ్రి, ఇతర వసతులను మెరుగుపర్చాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి, బడ్జెట్‌లో కేవలం 465 కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే సవతి తల్లి ప్రేమ కనబడుతున్నదని అన్నారు. కేటాయింపులు నిధుల మంజూరుకు చాలా వ్యత్యాసం ఉందని, అంకెల గారడీతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మరని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నించే నిరుద్యోగులపై బీఆర్ఎస్ తరహాలోనే నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని మానుకోవాలని లేదంటే యువత ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.