Round table meeting: కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో సోమవారం దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బోయిని తిరుపతి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా డీహెచ్‌పీఎస్ జాతీయ కౌన్సిల్ మెంబర్ బోయిని అశోక్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మణ్ హాజరై వారు మాట్లాడారు. దళితుల అభ్యున్నతికి ఆర్థికంగా వారు నిలదొక్కుకునేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించింది అమలు చేయాలన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ సంక్షేమం పేరిట గడిచిన ఏడు దశాబ్దాలుగా అనేక పథకాలు ప్రవేశపెట్టినా పేదరికం పోలేదన్నారు. ఇప్పటికీ సమాజంలో అత్యంత పేదరికం అనుభవించేవారు దళితులే అనే విషయాన్ని గుర్తించాలన్నారు. రిజర్వేషన్లు, ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక నిధులు, సబ్ ప్లాన్ తదితర సదుపాయాలు, సౌకర్యాలు కల్పించామని చెబుతున్నప్పటికీ వారి బతుకుల్లో మౌలికమైన మార్పు రావడం లేదన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం దళితుల విద్యాసామాజిక వికాసంతో పాటు ఆర్థికంగా వారు నిలదొక్కుకునేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించిందని తెలిపారు. సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలైన దళితులకు జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలని, బడ్జెట్లో తగిన నిధులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సామాజికంగా ఇంకా వెనుకబడి ఉన్న దళితుల సామాజిక వర్గం 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో విద్యా, ఉపాధి అవకాశాలలో వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లను అమలు చేయడం మూలంగా దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని సూచించారు. ఎస్సీల అభ్యున్నతి కోసం స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్సీ సబ్ ప్లాన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం ఒకానొక ప్రభుత్వ రూపం కారాదని, అది కచ్చితంగా సమాజ రూపం కావాలి అన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాటలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే బొపాల్ డిక్లరేషన్‌లో పాలు పంచుకున్న దళిత మేధావులు ప్రజాస్వామ్యం ఉండాలంటే ప్రజాస్వామిక సమాజం ఉండాలన్న డాక్టర్ అంబేద్కర్ మాటలపై విశ్వాసాన్ని ప్రకటించారని తెలిపారు. భోపాల్ డిక్లరేషన్ అమలు కోసం దళిత ఆదివాసి జనుల విముక్తి కోసం నిజాయితీగా ఉద్యమం నిర్మిద్దాం మరింత త్యాగం, మరింత ఉద్యమం, మరింత పోరాటం, మరింత ఐక్యతను, మనందరం కలిసికట్టుగా ప్రదర్శించాలని బోయిని అశోక్, తాళ్లపల్లి లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో డీఎల్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి సుదర్శన్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొంపల్లి సాగర్, డీహెచ్‌పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నక్క మల్లేశం, కొలిపాక వినోద్, రఘు మరియు పెద్దెల్లి శేఖర్, కనకం డేవిడ్, యుగంధర్, నరేశ్ తదితర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.