- ఆర్.ఓ.ఎఫ్.ఆర్ భూ సమస్యలను 10 రోజుల్లో పరిష్కరించాలి
- ఎస్సి, ఎస్టీ ప్లాన్ నిధులు పక్కదారి పట్టడానికి వీలు లేదు
- ఆసుపత్రిలో అత్యధిక ప్రసవాలు విజయవంతంగా నిర్వహించడం అభినందనీయం
- ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్‌కు సోలార్ ప్యానల్ ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
- జిల్లా అధికారులతో సమీక్షించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్
SC ST Commission Chairman: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 4 (మన బలగం): జిల్లాలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎస్పీ మహేష్ బి గితే, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, కుశ్రము నీలాదేవి, రేణిగుంట్ల ప్రవీణ్, జిల్లా శంకర్ లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ , సభ్యులు ఉదయము మేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్నారు. ఐ.డి.ఓ.సి వద్ద కలెక్టర్ సాదరంగా స్వాగతించారు. పోలీసు వారి చే గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను, విద్య, వైద్యం సంక్షేమ రంగంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను కలెక్టర్ వివరించారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ, సిరిసిల్ల జిల్లాలో 4 వేల 313 ఎకరాలకు సంబంధించి 6029 మంది రైతులు పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోగా 1614 మంది రైతులకు 2860 ఎకరాలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. పెండింగ్ ఆర్.ఓ.ఎఫ్.ఆర్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, అర్హులైన ఎస్టీ రైతులందరికీ పట్టాలు అందాలని 10 రోజులలో సమస్య పరిష్కారం కాకపోతే సంబంధిత అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించి చేపట్టిన పనులకు 1 కోటి 8 లక్షల నిధులను మంజూరు కోసం సింగరేణికి రాసామని అధికారులు తెలుపగా, సంబంధిత వివరాలు అందిస్తే సింగరేణి సి.ఎం.డితో మాట్లాడి ఆ నిధులు వెంటనే మంజూరు అయ్యేలా కృషి చేస్తానని ఎస్సీ ఎస్టీ చైర్మన్ హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టడానికి వీలు లేదని ఆయన స్పష్టం చేశారు. పంచాయతీ రాజ్, రోడ్డు భవనాలు, ముఖ్య ప్రణాళిక అధికారి పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో నిధులు పక్క దారి పట్ట వద్దని, ఎక్కడైనా నిధులు దుర్వినియోగం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. సబ్సిడీ కింద ప్రభుత్వం మంజూరు చేసే మొత్తం సద్వినియోగం జరిగి యూనిట్లకు గ్రౌండ్ అయ్యే విధంగా ప్రత్యేక చోరువ చూపాలని అన్నారు. సీ.ఎం.ఓ. కార్యాలయం లో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారులు బాగా పనిచేస్తున్నారని మంచి పేరు ఉందని, ఆ పేరు కాపాడుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఎటువంటి మరణాలు లేకుండా మాతా శిశు ఆసుపత్రిలో ప్రసవాలను విజయవంతంగా నిర్వహిస్తున్న వైద్య బృందానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అభినందనలు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి చర్యలు తీసుకుంటున్నారని ఆయన అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్ లలో విద్యార్థిని విద్యార్థుల రక్షణ కై, కుక్కలు, కోతుల సమస్య పరిష్కారం కోసం కు సోలార్ ప్యానల్ ఫెన్సింగ్ ఏర్పాటు ప్రతిపాదనలు 7 రోజుల్లో సిద్ధం చేయాలని, అవసరమైన నిధులు ప్రభుత్వం నుంచి విడుదల అయ్యేలా కృషి చేస్తామని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత మూడు సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పై 233 ఫిర్యాదులు రాగా 233 ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేశామని, 136 చార్జి షిట్ దాఖలు చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో పెండింగ్ ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. కోర్టులలో పెండింగ్ ఉన్న కేసులు శిక్ష వచ్చేలా సాక్ష్యాలను ప్రవేశ పెట్టాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ సమస్యలను పరిష్కరించి బాధితులకు సత్వరమే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో ఎఫ్.ఐ.ఆర్ నమోదైన కేసులో 116 మందికి, చార్జి షిట్ దశలో 57 మందికి మొత్తం కోటి 28 లక్షల 87 వేల 500 రూపాయల పరిహారం చెల్లించడం జరిగిందని, మిగిలిన 194 బాధితులకు చెల్లించాల్సిన కోటి 45 లక్షల 30 వేల రూపాయలు త్వరగా మంజూరు చేసేలా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. పోలీస్ కేసులకు సంబంధించి కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు కొరకు తహసిల్దార్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద ఎస్సీ ఎస్టీలకు 100% పని దినాలు కల్పించాలని, వేసవి దృష్ట్యా పని ప్రదేశాలలో చల్లని త్రాగునీరు, నీడ, ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. ఎస్సీ,ఎస్టీ గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్ లలో ప్రభుత్వం రూపొందించిన డైట్ మెన్యూ ను తూచ తప్పకుండా పాటించాలని అన్నారు.
స్టడీ సర్కిల్ లో విద్యార్థులకు అవసరమైన వస్తువులు కల్పించాలని అన్నారు. స్వయం ఉపాధి కల్పన పథకం కింద రాజీవ్ వికాసం ద్వారా ఎస్సీ ఎస్టీ యువతకు అర్హత మేరకు రుణాలు అందేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ శాఖలలో ఎస్సీ,ఎస్టీ అధికారులకు రోస్టర్ పాయింట్ ప్రకారం పదోన్నతులు సజావుగా పారదర్శకంగా వచ్చేలా వ్యవహరించాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నియామకాలలో సైతం 15% ఎస్సీలకు రిజర్వేషన్ అమలు చేయాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్ కోసం అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యుల సూచనలు, ఆదేశాలను అధికారులు తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. సభ్యులు వివిధ అంశాల పై కోరిన సమాచారాన్ని, ప్రతిపాదనలను నిర్దిష్ట సమయంలో అందించాలని అన్నారు. ఎస్సీ,స్టడీ సర్కిల్ కోసం భూమి కేటాయింపు చేయడం జరిగిందని, అక్కడ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కొరారు.
అనంతరం రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ , సభ్యులను జిల్లా అధికారులు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు ఘనంగా సన్మానించారు. ప్రజల నుండి వారి సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించారు. కార్యక్రమంలో వేములవాడ ఏ.ఎస్పీ. శేషాద్రిని రెడ్డి, రెవెన్యూ డివిజన్ అధికారీ రాధా భాయి, డి.ఎస్పీ. చంద్ర శేఖర్ రెడ్డి,జిల్లా అధికారులు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు,వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.