National Pensioners Day: నిర్మల్, డిసెంబర్ 17 (మన బలగం): పెన్షనర్ల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో నిర్వహించిన జాతీయ పెన్షనర్ల దినోత్సవంలో ముఖ్యఅతిథిగా ఆమె పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమానికి హాజరైన జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి రాధిక, డీటీవో సరోజలతో కలిసి కలెక్టర్ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పెన్షనర్ల హక్కులు, సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. నేటి జాతీయ పెన్షనర్ల దినోత్సవ కార్యక్రమానికి హాజరైన పెన్షనర్లందరికి పెన్షనర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మీరు అందించిన సేవలను గౌరవించుకోవడం, అనుభవాలను పంచుకోవడం కోసం ప్రత్యేకమైన రోజు అని తెలిపారు. మీరు చేసిన కృషి, నిబద్ధత, అంకితభావం ఫలితంగానే సమాజం ఈ స్థాయికి చేరుకుందని అన్నారు.
జిల్లాకు ఎన్నో సంవత్సరాలుగా మీరు చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ద్వారా హక్కులు, రక్షణను పొందవచ్చు అని తెలిపారు. సంక్షేమ వసతి గృహాలను సందర్శించి విద్యార్థులకు మీ అనుభవాలను వివరిస్తూ వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దేలా మీ విలువైన సలహాలు, సూచనలు అందించాలని కోరారు. మీ హక్కుల రక్షణ, సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ హామీ ఇచ్చారు. డీఎల్ఎస్ఏ కార్యదర్శి మాట్లాడుతూ, నేడు దేశవ్యాప్తంగా జాతీయ పెన్షనర్ల దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రతి రిటైర్డ్ ఉద్యోగి పెన్షన్ తీసుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని పెన్షన్ ఆర్థిక భద్రతనే కాకుండా జీవితానికి గౌరవాన్ని కలిగించేదని అన్నారు. నేటి సమాజంలో వయోవృద్ధులకు ఎదురైతున్న సమస్యల పరిష్కారానికి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ తరఫున చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీ విలువైన సలహాలు, జీవితానుభవాలతో నేటి తరానికి మార్గ నిర్దేశం చేయాలని కోరారు.
అంతకుముందు పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు ఎంసీ లింగన్న మాట్లాడుతూ, పెన్షనర్ల సంఘ భవనం కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 5 లక్షలు జిల్లా కలెక్టర్ మంజూరు చేశారని తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో పెన్షనర్ల సంక్షేమానికి పడుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం మున్సిపల్ కార్మికులను, విశ్రాంత ఉద్యోగులను కలెక్టర్, అధికారులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్న కళ్యాణి, ఎస్టీవో రమేశ్, తహసీల్దార్ రాజు, సంఘం ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.