Murder Case: బుగ్గారం, డిసెంబర్ 31 (మన బలగం): హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదుతోపాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ మంగళవారం జగిత్యాల జిల్లా న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోనికి శేకల్ల గ్రామానికి చెందిన మైదం శంకరయ్య అదే గ్రామానికి చెందిన ఒడ్నాల పోచమల్లుకు మద్యం సేవిస్తున్న ప్రదేశంలో గొడవ జరిగింది. ఈ గొడవను మనసులో పెట్టుకొని శంకరయ్యను చంపాలని ఉద్దేశంతో పోచమల్లు తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర గాయాలైన శంకరయ్య ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుని అల్లుడి ఫిర్యాదు మేరకు బుగ్గారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు ఒడ్నాల పోచమల్లును కోర్టులో హాజరు పరిచారు. కేసును విచారించిన జిల్లా న్యాయమూర్తి నీలిమ నిందితునికి జీవిత ఖైదుతో పాటు రూ.5000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. ఈ కేసులో పీపీగా మల్లికార్జున్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్‌గా ఇన్‌స్పెక్టర్లు నాగేందర్, లక్ష్మీబాబు, ఎస్.ఐ రవీందర్, కోర్ట్ కానిస్టేబుల్ శ్రీధర్, లైజనింగ్ కానిస్టేబుల్ కిరణ్ నిందితునికి శిక్ష పడడంలో కోర్టుకు సాక్షాధారాలు అందించడంలో ప్రముఖ పాత్ర వహించారు. పై కేసులో నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు.