- నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా?
- నిరుద్యోగ ర్యాలీలో విధ్వంసం చేసేందుకు బీఆర్ఎస్ కుట్ర
- కేటీఆర్ ఓ యూజ్ లెస్ ఫెలో
- డ్రగ్స్ తీసుకుని చీకటి దందాలు సాగించిన బతుకు నీది
- నా జోలికొస్తే.. నీ చీకటి బతుకులను బయటపెడతా
- నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు బిడ్డా
- సికింద్రాబాద్‌లో పోలీసుల లాఠీఛార్జ్‌ను ఖండిస్తున్నా
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
Protest of Group-1 candidates: మనబలగం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. అందులో భాగంగానే గ్రూప్-1 పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను వర్తింపజేయకుండా జీవో నెంబర్ 29 జారీ చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు 29 జీవోను ఎత్తివేసి, గ్రూప్-1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని స్పష్టం చేశారు. నిరుద్యోగుల ఆందోళనను ప్రభుత్వానికి తెలియజేసేందుకే తాము శనివారం ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. బీజేపీపట్ల నిరుద్యోగులు చూపుతున్న స్పందనను చూసి ఓర్వలేక.. బీఆర్ఎస్ నేతలు తమ ర్యాలీలో చొరబడి విధ్వంసం చేసేందుకు కుట్ర చేశారని మండిపడ్డారు. నిరుద్యోగుల పక్షాన తాను పోరాడుతుంటే.. కేటీఆర్ పిచ్చికుక్కలా మొరుగుతున్నాడని నిప్పులు చెరిగారు.
‘కేటీఆర్.. నువ్వో యూజ్ లెస్ ఫెలో.. నేను పోరాడుతుంటే నాపై వ్యక్తిగత దూషణలు చేస్తావా? నీ డ్రగ్స్, చీకటి లీలలు తెలియదనుకుంటున్నవా? కాంగ్రెస్ తో మీ కుమ్కక్కు రాజకీయాలు తెలియదనుకుంటున్నవా? నా జోలికొస్తే నీ బండారమంతా బయటపెడతా.. అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘నేను హిందీ పేపర్ లీక్ చేసినట్లు, నువ్వు డ్రగ్స్ తీసుకోలేదని దేవుడి ముందు నీ ఫ్యామిలీతో కలిసి ప్రమాణం చేసే దమ్ముందా నీకు.. నువ్వు ఆ పనిచేస్తే నేను క్షమాపణ చెప్పేందుకు సిద్ధం’ అని సవాల్ విసిరారు. బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు ఆంటోనిరెడ్డి, అధికార ప్రతినిధి జె.సంగప్ప, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మహేందర్, రాష్ట్ర నాయకులు డాక్టర్ పుల్లారావులతో కలిసి శనివారం మీడియాతో మాట్లాడారు. ఏమన్నారంటే. ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సూచన మేరకు గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనకు మద్దతిచ్చేందుకు అశోక్ నగర్ వెళ్లిన. నిరుద్యోగుల ఘోషను ప్రపంచానికి విన్పించినం.
జీవో 29 పేరుతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని నిరుద్యోగులు చెబుతున్న మాటలు విని బాధ అన్పించింది. ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. మోదీ అగ్రవర్ణాలు సహా అన్ని సామాజికవర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తే కాంగ్రెస్ మాత్రం రిజర్వేషన్లను తీసేయాలని కుట్ర చేయడం దుర్మార్గం. రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలి. కావాలనే జీవో 29 తీసుకొచ్చి రిజర్వేషన్లను రద్దు చేసి గందరగోళం సృష్టించడం ద్వారా గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయాలనే కుట్ర చేస్తున్నారు. నిరుద్యోగులంతా గ్రూప్ 1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయమని మాత్రమే కోరుతున్నారు. అంతకంటే ముందు రిజర్వేషన్లకు గొడ్డలిపెట్టుగా ఉన్న 29 జీవోను రద్దు చేయాలని కోరుతున్నారు. కోర్టులో 22 కేసులు గ్రూప్ 1 పై నడుస్తున్నాయి. వీటిపై లీగల్ ఓపినియన్ తీసుకుని గ్రూప్ 1 రద్దు కాకుండా చూడాలని కోరుతున్నారు. బీజేపీ కూడా ఇదే విషయం చెబుతోంది. నిరుద్యోగులకు మద్దుతుగా నిలిచింది.
అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకింత మొండిగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదు. గతంలో రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి నిరుద్యోగులతో తియ్యగా మాట్లాడారు. బీఆర్ఎస్ ను తిట్టి వెళ్లారు. కానీ అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తున్నరు. రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్ర చేస్తోంది. జీవో 29పై ప్రశ్నిస్తే మహిళలు, గర్భిణీలు అని చూడకుండా దారుణంగా కొట్టి అరాచకం సృష్టించారు. హాస్టళ్లలో చొరబడి, షాపులో దాక్కుంటే బయటకు గుంజి కొట్టిన దృశ్యాలు చూసి చలించిపోయి అక్కడికి వెళ్లిన. నిరుద్యోగులతో మాట్లాడిన. బాధితుల కన్నీళ్లను చూసిన. కొందరు పోలీసులు తిట్టిన తిట్లు భరించలేక చనిపోదామని చాలా మంది నాతో చెప్పారు. అసలు నిరుద్యోగులు చేసిన తప్పేంది? ఇంత అరాచకం సృష్టిస్తారా? ఇంత జరుగుతున్నా సీఎం ఎందుకు స్పందించడం లేదు? నిరుద్యోగుల ఘోష విన్పించడం లేదా? ఇప్పటికైనా స్పందించాలి. 29 జీవోను రద్దు చేయాలి. గ్రూప్ 1 పరీక్షలును రీషెడ్యూల్ చేయాలి.
లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందే. ఇవే బీజేపీ ప్రధాన డిమాండ్లు. మేం నిరుద్యోగుల పక్షాన ర్యాలీ చేస్తుంటే.. బీఆర్ఎస్ నేతలు చొరబడ్డారు. విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేశారు. నిరుద్యోగులు వాళ్లను అడ్డుకుంటే అరాచకం సృష్టించాలనుకున్నరు. నిరుద్యోగులు బీజేపీకి ఇస్తున్న మద్దతును చూసి ఓర్వలేక ఈ కుట్రలు చేశారు. విధ్వంసంతో నిరుద్యోగులపై కేసులు పెట్టించే కుట్ర చేశారు.. నన్ను అరెస్ట్ చేశారని వచ్చిన వార్తల్లో నిజం లేదు. నన్ను అరెస్ట్ చేసే దమ్ము ఎవరికి ఉంది? కేటీఆర్ ఓ మూర్ఖుడు. ఫాల్త్ రాజకీయాలు చేస్తున్నడు. నేను ర్యాలీ చేస్తుంటే పిచ్చి పిచ్చిగా వ్యక్తిగత దూషణలు చేస్తున్నరు. యూజ్ లెస్ ఫెలో.. నిరుద్యోగుల గురించి పోరాడుతుంటే.. పర్సనల్ కామెంట్స్ చేస్తావా? నీదో బతుకా? నీ బాధ భరించలేకే మీ అయ్య ఫాంహౌజ్‌లో పండుకున్నడు. నీకు దమ్ముంటే.. నేను పేపర్ లీకేజీ చేసినట్లు గుడి వద్దకు వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేసే దమ్ముందా?… నువ్వా నా గురించి మాట్లాడేది? కాంగ్రెస్ తో మీ కుమ్మక్కు రాజకీయాలు ఎవరికి తెల్వదు.
నీ ఫాంహౌజ్ ను సీఎం ఎందుకు కూల్చడం లేదు? నువ్వు డ్రగ్స్ తీసుకునే కేసు ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ లో మీ అయ్య ఉన్నాడని నిందితుల వాంగ్మూలం ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఢిల్లీలో మీ అయ్య చేస్తున్న చీకటి రాజకీయాలు, పంపుతున్న డబ్బు సంచుల సంగతి తెల్వదనుకుంటున్నవా? పిచ్చి పిచ్చి వాగుడు వాగితే నిన్ను నీ పార్టీ కార్యకర్తలే తరిమికొట్టే రోజులొస్తాయి.. నీ అహంకారంవల్లే పార్టీ పతనమైంది. అయినా మీకు సిగ్గు రాలేదు. నిరుద్యోగులు అల్లాడుతుంటే అశోక్ నగర్ వెళతానని మాట ఇచ్చి తప్పిన మూర్ఖుడివి నువ్వు. నువ్వు పొరపాటున అశోక్ నగర్ వెళితే రాళ్లతో తరిమికొడతారనే భయంతోనే అక్కడికి వెళ్లకుండా భయపడి తోకముడిచిన మూర్ఖుడివి నువ్వు..ఇకనైనా నోరు అదుపులో పెట్టుకో. లేకుంటే నీ బతుకంతా బయటపెట్టాల్సి వస్తది.’ అని అన్నారు.